విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్‌ అరెస్ట్‌ ఆందోళనకరం : ఎడిటర్స్‌ గిల్డ్‌

 కోల్‌కతా :    సందేశ్‌కాలిలో విధినిర్వణలో ఉన్న జర్నలిస్టును అరెస్ట్‌ చేయడం ఆందోళనకరమని ఎడిటర్స్‌ గిల్డ్‌ మండిపడింది. స్థానిక మహిళ నివాసంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి రిపోర్టింగ్‌ చేస్తున్న   సమయంలో జర్నలిస్ట్‌ సంతుపాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్‌ బంగ్లాకు చెందిన పాన్‌ రిపోర్టింగ్ ప్రత్యక్ష ప్రసారమవుతున్న సమయంలో  అదుపులోకి తీసుకోవడం ఆందోళనకరమని మంగళవారం విడుదల చేసిన ప్ర కటనలో పేర్కొంది.   ఒకవేళ జర్నలిస్టుపై  ఫిర్యాదు వస్తే ముందుగా పోలీసులు  దర్యాప్తు చేపట్టాలని  పేర్కొంది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపి పాన్‌కు అన్యాయం జరగకుండా చూడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే పత్రికా స్వేచ్ఛను కాపాడుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది.

జర్నలిస్టు అరెస్ట్‌ను కోల్‌కతా ప్రెస్‌ క్లబ్‌ కూడా ఖండించింది. పాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. అతనిపై ఆరోపణ ఉంటే విచారణ చేపట్టాలని పేర్కొంది. రిపోర్టింగ్‌లో ఉన్న జర్నలిస్టును అరెస్ట్‌ చేయడంపై నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

తాను దుస్తులు మార్చుకుంటుండగా తన ఇంట్లోకి చొరబడి వీడియో తీస్తున్నట్లు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిని అరెస్ట్‌ చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.

➡️