ఎన్నికల బాండ్లు రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారు : మోడీ

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందని, దీనిపై నిజాయితీగా ఆలోచిస్తే.. వీటిని రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధ పడతారన్నారు. జాతీయ మీడియా సంస్థ ఎఎన్‌ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. 78 నిమిషాలపాటు ఈ ఇంటర్వ్యూ సాగింది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్న మోడీ. నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసుకు వచ్చిన స్పచ్ఛమైన ఆలోచనే ఎన్నికల బాండ్లు అని అన్నారు. నల్లధనం నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గం అని తాను ఎన్నడూ చెప్పలేదని, అయితే ఇదొక చిన్న మార్గం అని బలంగా నమ్ముతున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ పథకం కారణంగా బిజెపికే ఎక్కువ ప్రయోజనం చేకూరిందనడం సరికాదన్నారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన దాడి చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అణిచివేయడానికి బిజెపి ప్రభుత్వం ఉపయోగిస్తోందన్న విమర్శలకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా ఎంతమంది ప్రతిపక్ష నాయకులు జైళ్లలో ఉన్నారో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హోం మంత్రిని జైల్లో పెట్టారని మోడీ గుర్తు చేశారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిబిఐ, ఇడిలు అవినీతిని అరికట్టడానికి విశేషంగా కృషి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ”దేశ భవిష్యత్తుపై నా వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయి. రాజ్యాంగం మార్పుపై వస్తున్న వదంతులను నమ్మి భయపడకండి. నా దేశ సంపూర్ణ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటా” అని మోడీ చెప్పారు. ”కొన్ని ప్రభుత్వాలు తాము ప్రతీది చేశామని చెప్పుకుంటాయి. కానీ నేను అన్నీ చేశానని చెప్పను. దేశ అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి, చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి కుటుంబం కలలను నెరవేర్చాలి. అందుకే ఇప్పటివరకు మేము చేసింది ట్రైలర్‌ మాత్రమే” అని అన్నారు.

➡️