ఐక్యరాజ్య సమితి వేదికపై కాశ్మీర్‌ గురించి తప్పుడు కథనాలు !

పాక్‌ తీరుపై మండిపడ్డ భారత్‌
ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) వేదికపై కాశ్మీర్‌ ప్రస్తావనలు తీసుకువచ్చినందుకు పాకిస్తాన్‌పై భారత్‌ మండిపడింది. పాక్‌ రాయబారి జనరల్‌ అసెంబ్లీలో నిరాధారమైన, మోసపూరితమైన కథనాలు చెబుతున్నారని భారత్‌ ప్రతినిధి ప్రతీక్‌ మాథుర్‌ విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ఒక ప్రతినిధి వర్గం ఈ వేదికను దుర్వినియోగం చేసిందని, ఎలాంటి ఆధారాలు లేని, తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించిందని విమర్శించారు. ఆ ప్రతినిధి బృందానికి ఇదేమీ కొత్త కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందించాలని తాను కోరుకోవడం లేదన్నారు. ఈ వేదిక విలువైన సమయాన్ని కాపాడేందుకే తాను మాట్లాడడం లేదన్నారు. భద్రతా మండలి వార్షిక నివేదికపై జనరల్‌ అసెంబ్లీ చర్చ సందర్భంగా మాథుర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చ జరుగుతున్నపుడు పాకిస్తాన్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ జనరల్‌ అసెంబ్లీ పోడియం నుండి మాట్లాడుతూ కాశ్మీర్‌ గురించి ప్రస్తావనలు చేశారు. ఆ నేపథ్యంలో మాథుర్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి వివిధ వేదికలపై జమ్మూ కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం, వాటిపై వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌కు ఒక అలవాటుగా మారింది. ఆ వేదికలపై చర్చించే అంశం ఏదైనా సరే దానితో సంబంధం లేకుండా కాశ్మీర్‌ గురించి మాట్లాడుతూ వుంటుంది. అయితే ఎన్నడూ పాక్‌కు ఎలాంటి మద్దతు లభించలేదు. జమ్మూ కాశ్మీర్‌,లడఖ్‌ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లోనే అంతర్భాగాలుగా వుంటాయని భారత్‌ స్పష్టం చేస్తూ వస్తోంది.

➡️