ఎస్‌ఎఫ్‌ఐ సెక్రటరీపై బీర్ బాటిల్‌తో దాడి.. మహారాజాస్ కాలేజీలో ఉద్రిక్తత

Jan 18,2024 13:25 #kerala, #SFI

తిరువనంతపురం :   కొచ్చిలోని మహారాజాస్‌ కాలేజ్‌లో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) యూనిట్‌ సెక్రటరీ అబ్దుల్‌ నజీర్‌పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున 1.00 గంటకు కాలేజీ హాస్టల్‌ ఆవరణలో ఫ్రాటెర్నిటీ మూవ్‌మెంట్‌ సభ్యులు బీర్‌బాటిల్‌తో పొడిచినట్లు వెల్లడించారు. మొదట ఎర్నాకులం జనరల్‌ ఆస్పత్రికి తరలించిన అబ్దుల్‌ నజీర్‌ను అనంతరం మెడికల్‌ ట్రస్ట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. చేయి ఫ్రాక్చర్‌ అయ్యిందని, బీర్‌ బాటిల్‌తో పొడవడంతో కొన్ని చోట్ల కుట్లు పడ్డాయని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఎస్‌ఎఫ్‌ఐ, కేరళ స్టూడెంట్స్‌ యూనియన్‌ ( కెఎస్‌యు) అరబిక్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌పై ఫ్రాటెర్నిటీ మూవ్‌మెంట్‌ సభ్యుడు దాడిని ఖండిస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ క్యాంపస్‌లో నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

నాజర్‌ పిటిషన్‌ ఆధారంగా అనుమానిత ఫ్రాటెర్నిటీ మూవ్‌మెంట్‌ కార్యకర్తలపై ఐపిసి సెక్షన్‌ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ పోలీసులు తెలిపారు. నాజర్‌ను ఎర్నాకులం జనరల్‌ ఆస్పత్రికి తరలించిన వారికి, చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఫ్రాటెర్నిటీ సభ్యులకు మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్యూటీ డాక్టర్‌ ఫిర్యాదు మేరకు వారిపై మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గత కొన్ని రోజులుగా క్యాంపస్‌లో కెఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐల కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపస్‌లో ఇతర విద్యార్థి సంఘాలను విస్మరిస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐ పట్ల కాలేజీ యాజమాన్యం మెతకవైఖరి ప్రదర్శిస్తోందంటూ ఫ్రాటెర్నిటీ మూవ్‌మెంట్‌ ఆరోపిస్తోంది. ఫ్యాకల్టీపై ఫిర్యాదు కూడా చేశారు.

ఈవారం ప్రారంభంలోనూ కెఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. అడ్డుకున్న ఫ్యాకల్టీపై కూడా ప్రాటెర్నిటీ మూవ్‌మెంట్‌ సభ్యులు దాడికి దిగారు. దీంతో నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాలేజీ యూనియన్‌ ఇన్‌చార్జ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్టాఫ్‌ అడ్వైజర్‌ నిజాముద్దీన్‌ కె.ఎం. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ నిలిపివేత

ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన కాలేజీ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ను కాలేజీ యాజమాన్యం రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం నిర్వహించే కాలేజీ అధికారుల అత్యవసర సమావేశంలో మహారాజాస్‌ కాలేజీని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

15 మంది దుండగులపై కేసు

కొచ్చి : కేరళ కొచ్చిలోని మహారాజాస్‌ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్‌ సెక్రటరీని నరికి చంపేందుకు ప్రయత్నించిన 15 మంది కెఎస్‌యు, అనుబంధ సంఘాల కార్యకర్తలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఎంజి నాటకోత్సవాల్లో భాగంగా క్యాంపస్‌లో నాటక శిక్షణ కొనసాగుతోంది. ఆర్గనైజింగ్‌ కమిటీలో భాగంగా క్యాంపస్‌లో అబ్దుల్‌ నాసర్‌తోపాటు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు పాల్గొన్నారు. కెఎస్‌యు నాయకులు అమల్‌టోమీ, అనుబంధ సంఘం నాయకుడు బిలాల్‌ ఆధ్వర్యాన 15 మంది బుధవారం అర్ధరాత్రి కాలేజీ సెంటర్‌ సర్కిల్‌లో నాజర్‌ (21) తదితరులపై కత్తులతో, ఇనుపరాడ్లపై దాడికి పాల్పడ్డారు. ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నాజర్‌కు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది.

➡️