బిజెపికి జిఎంఆర్‌ విరాళాలు!

Jun 30,2024 00:30

ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా అందజేత
టెర్మినల్‌-1 ప్రారంభం తర్వాత నిధుల ప్రవాహం
ట్రస్ట్‌ నిధుల్లో 75 శాతం కమలం పార్టీకే
బయటపెట్టిన రాయిటర్స్‌, ఎడిఆర్‌
న్యూఢిల్లీ : జిఎంఆర్‌ కంపెనీ నిర్వహిస్తున్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌ా1 పైకప్పు పాక్షికంగా కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ జిఎంఆర్‌ కంపెనీ 2018 నుండి ఓ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా అధికార బిజెపికి విరాళాలు అందించింది. ఈ విరాళాలు నేరుగా కాకుండా ట్రస్ట్‌ ద్వారా దొడ్డిదారిన బిజెపి ఖాతాకు చేరాయి. ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందించిన సంస్థలలో జిఎంఆర్‌ ఒకటి. ఈ ట్రస్ట్‌ తనకు అందిన నిధులలో అధిక భాగాన్ని బిజెపికే సమకూర్చింది.
అధిక నిధులు అధికార పార్టీకే
ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన బాండ్ల కొనుగోలుదారుల జాబితాలో జిఎంఆర్‌ పేరు లేదు. ఈ కంపెనీ బిజెపికి పరోక్షంగా విరాళాలు అందించిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దేశంలో పదిహేను ఎలక్టోరల్‌ ట్రస్ట్‌లు ఉండగా వాటిలో అతి పెద్దది, సంపన్నమైనది ప్రుడెంట్‌ ఎలక్టొరల్‌ ట్రస్టే. 2013లో ఈ ట్రస్ట్‌ ఏర్పడగా ఇప్పటి వరకూ 272 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇందులో సుమారు 75% నిధులను బిజెపికే సమర్పించిందని తేల్చింది.
దాతల జాబితాలో లేకున్నా…
వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలు ఏ విధంగా విరాళాలు అందించిందీ ప్రుడెంట్‌ బహిర్గతం చేయలేదు. 2018-23 మధ్యకాలంలో బడా భారతీయ కంపెనీల నుండి ట్రస్ట్‌కు అందిన నిధుల వివరాలను రాయిటర్స్‌ సంస్థ ప్రభుత్వ రికార్డుల నుండి సేకరించింది. 2019-23 మధ్యకాలంలో ఎనిమిది బడా వ్యాపార గ్రూపులు ఈ ట్రస్టుకు కనీసం యాభై మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చాయి. ఆ మొత్తం బిజెపికి చెక్కు రూపంలో చేరాయి. ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్సార్‌, జిఎంఆర్‌ సంస్థల లావాదేవీలను రాయిటర్స్‌ గుర్తించింది. ఈ కంపెనీలు బిజెపికి నేరుగా విరాళాలు ఇవ్వలేదని, అందుకే అవి దాతల జాబితాలో లేవని తెలిపింది. తన ఆంతరంగిక మార్గదర్శకాల మేరకు ప్రుడెంట్‌ ఆయా పార్టీలకు విరాళాలు అందజేసిందని జిఎంఆర్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆ మార్గదర్శకాలేమిటో ఇప్పటి వరకూ తెలియరాలేదు. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం జిఎంఆర్‌కు ఇష్టం లేదని రాయిటర్స్‌ చెప్పింది. ప్రుడెంట్‌ ట్రస్ట్‌ ఇతర పార్టీలకు కూడా విరాళాలు అందించింది కానీ ఎక్కువ భాగం బిజెపి ఖాతాకే చేరాయని రాయిటర్స్‌ స్పష్టం చేసింది.
ఎడిఆర్‌ నివేదిక కూడా…
సంవత్సరాల వారీగా ఎన్నికల ట్రస్టుల లావాదేవీలను విశ్లేషించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) కూడా ప్రుడెంట్‌ వైపే వేలెత్తి చూపింది. 2018-19లో జిఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్‌ సంస్థ అందరి కంటే అత్యధికంగా పాతిక కోట్ల రూపాయల విరాళం అందించిందని ఎడిఆర్‌ తెలిపింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 2018-19లో ప్రుడెంట్‌ ట్రస్ట్‌ బిజెపికి రూ.67.25 కోట్ల విరాళాన్ని అందించింది. దానికి ముందు సంవత్సరం రూ.154.30 కోట్లు ఇచ్చింది. 2019-20లో కూడా అన్ని ట్రస్టులు కలిపి తమకు అందిన నిధులలో 76% నిధులను బిజెపికే సమర్పించుకున్నాయి. ఆ ఏడాది ప్రుడెంట్‌ ట్రస్ట్‌ బిజెపికి రూ.217.75 కోట్లు అందజేసింది. ఈ ట్రస్ట్‌కు సిఎంఆర్‌ గ్రూప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డిఎల్‌ఎఫ్‌, అపోలో టైర్స్‌ సంస్థలు పెద్ద ఎత్తున నిధులు అందించాయి.
అంగీకరించిన కమలం పార్టీ
2021-22లో ప్రుడెంట్‌ ట్రస్ట్‌ తనకు అందిన నిధులలో అత్యధికంగా రూ.336.509 కోట్లను బిజెపికి అందజేసింది. ఇందులో రూ.20 కోట్లు జిఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్‌ ఇచ్చినవే. 2022-23లో కూడా ఈ తంతు కొనసాగింది. ఆ ఏడాది ప్రుడెంట్‌కు రూ.360 కోట్ల కార్పొరేట్‌ నిధులు అందాయి. ఆ సంవత్సరం ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా బిజెపికి లభించింది రూ.259.08 కోట్లు. అందులో ఒక్క ప్రుడెంట్‌ నుండే రూ.256.25 కోట్లు అందాయి. తనకు అందిన నిధులలో అధిక భాగాన్ని ప్రుడెంట్‌ సంస్థ బిజెపికి అందజేసిందని, ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్‌-1ను ప్రధాని మోడీ ప్రారంభించిన నెల రోజుల తర్వాత ఈ విరాళాలు అందాయని రాయిటర్స్‌ తెలిపింది. ప్రుడెంట్‌ ట్రస్ట్‌ నుండి తనకు భారీగా విరాళాలు అందాయని 2019లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలలో బిజెపి స్వయంగా అంగీకరించింది.

➡️