హెచ్‌డి రేవణ్ణ అరెస్టు

May 5,2024 00:21 #arest, #Bengaluru, #H. D. Revanna
  • మహిళ అపహరణ కేసులో అదుపులోకి తీసుకొన్న సిట్‌
  • ఆయన తనయడు ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్‌ నోటీసులు!

బెంగళూరు : మాజీ మంత్రి, హోలెనరసిపుర ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పద్మనాభ నగర్‌లో తన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నివాసంలో శనివారం సాయంత్రం 6.45గంటలకు ఈ అరెస్టు జరిగింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు రేవన్న ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన నిముషాల వ్యవధిలోనే అరెస్టు చేశారు. సిట్‌ బృందాలు రేవన్నను అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు హై డ్రామా నడిచింది. మాజీ ప్రధాని నివాసంలో రేవన్న వున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న సిట్‌ అధికారులు కోర్టు ఉత్తర్వులు వెలువడిన నిముషాల వ్యవధిలోనే పద్మనాభ నగర్‌ నివాసం గేటు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. గేట్లు తెరవకపోవడంతో బద్దలు కొట్టడానికి ఆలోచిస్తున్న నేపథ్యంలో రేవణ్ణ స్వయంగా ఇంటి తలుపులు తెరుచుకుని వచ్చి మరీ పోలీసులకు లొంగిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బయట గేట్ల వద్ద ఇంత హై డ్రామా నడుస్తుంటే దేవెగౌడ ఆ సమయంలో ఇంట్లోనే వున్నారని ఆ వర్గాలు ధ్రువీకరించాయి. నగరంలోని సిఐడి హెడ్‌క్వార్టర్స్‌లో సిట్‌ కార్యాలయానికి రేవణ్ణను తీసుకుని వచ్చారు.

మైసూరు జిల్లాలోని కెఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 2న నమోదైన కిడ్నాపింగ్‌ కేసులో రేవణ్ణను అరెస్టు చేశారు. లైంగిక బాధితురాలు ప్రస్తుతం పరారీలో వున్న హసన్‌ ఎంపి, తన కుమారుడైన ప్రజ్వల్‌ రేవన్నకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకు గానూ హెచ్‌డి రేవన్న ఆదేశాల మేరకు ఆమెను ఏప్రిల్‌ 29న కిడ్నాప్‌ చేశారు. తనను విడిచిపెట్టాల్సిందిగా వేడుకుంటున్న ప్పటికీ ప్రజ్వల్‌ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. బాధితురాలి కుమారుడు కెఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దాని ఆధారంగా రేవణ్ణపై, ఆయన సన్నిహిత సహచరుడు సతీష్‌ బాబుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సతీష్‌ బాబును శుక్రవారం అరెస్టు చేశారు.
రేవణ్ణ ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించడానికి కొద్ది గంటలు ముందుగానే శనివారం మధ్యాహ్నం సిట్‌ అధికారులు కిడ్నాప్‌ అయిన మహిళను రక్షించారు. మైసూరు జిల్లా హన్సూర్‌ తాలుకాలో కలెనహళ్లిలో రేవన్న సన్నిహిత సహచరుడు రాజశేఖర్‌ ఫార్మ్‌హౌస్‌లో ఆమెను నిర్బంధించారు.

ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్‌ నోటీసులు
హసన్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవన్నపై సిబిఐ బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేసే అవకాశం వుందని సిట్‌ అధికారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శనివారం తెలియజేశారు. సిట్‌ అధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి, ప్రజ్వల్‌ను అరెస్టు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయాల నుండి తమకు సమాచారం అందగానే నిందితుడిని వెనక్కి రప్పించి, అరెస్టు చేస్తామని సిట్‌ అధికారులు హామీ ఇచ్చారని ఆ ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఇంటర్‌పోల్‌ ఈ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేస్తుంది. ఒక వ్యక్తి గుర్తింపు, ఎక్కడున్నదీ సమాచారం లేదా నేరానికి సంబంధించిన కార్యకలాపాలు వంటి అదనపు సమాచారాన్ని సభ్య దేశాల నుండి సేకరించేందుకు ఈ నోటీసులు జారీ చేస్తారు. భారత్‌లో ఇంటర్‌పోల్‌ వ్యవహారాలు చూసే నోడల్‌ సంస్థ సిబిఐని నోటీసులు జారీ చేయాల్సిందిగా సిట్‌ కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. సిబిఐ నోటీసులు జారీ చేస్తే ప్రజ్వల్‌ ఎక్కడున్నారో సమాచారం తెలుస్తుందని సిట్‌ భావిస్తోంది. ప్రజ్వల్‌ రేవన్నను అరెస్టు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ కేసులో పాత్ర వున్న మిగిలిన వారిపై కూడా నిర్ణయాత్మక, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

➡️