Kejriwal:సార్వత్రిక ఎన్నికల ముందు అరెస్ట్‌పై ఇడిని నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేసిన ‘సమయం’పై సుప్రీంకోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని నిలదీసింది.  సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమవడానికి కొన్ని రోజుల ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించింది. మే 3లోగా సమాధానమివ్వాలని ఇడిని ఆదేశించింది. స్వేచ్ఛ చాలా ముఖ్యమని, తాము దానిని తిరస్కరించలేమని, అయితే అరెస్ట్‌ వ్యవహారంలో ఎందుకు జాప్యం జరిగిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి అనుబంధ చర్యలు చేపట్టలేదని, ఒకవేళ చేపట్టి వుంటే .. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌ ప్రమేయం ఏవిధంగా ఉందో వివరించాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఇడిని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్ట్‌ చేశారని ఇడిని నిలదీశారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా విషయంలో తగిన సమాచారాన్ని గుర్తించామని ఇడి పేర్కొందని, అయితే కేజ్రీవాల్‌ కేసులో ఎటువంటి మెటీరియల్‌ను గుర్తించలేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. విచారణను ప్రారంభించడానికి, అరెస్ట్‌కు మధ్య ఇంత గ్యాప్‌ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తూ..  శుక్రవారంలోగా దీనిపై స్పందించాలని ఇడిని ఆదేశించారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రెండు రోజులుగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.

➡️