హెల్మెట్‌ పెట్టుకోలేదని నష్ట పరిహారాన్ని నిరాకరించకూడదు  : మద్రాస్‌ హైకోర్టు

Apr 22,2024 22:48 #bike ride, #Madras High Court

చెన్నై : ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ ధరించకపోవడం నిర్లక్ష్యం కాదని, హెల్మెట్‌ ధరించలేదనే కారణంతో ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని నిరాకరించకూడదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. 2010లో ఈరోడ్‌లో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి బస్సును ఢకొీని మరణించిన కేసులో బాధిత కుటుంబానికి 2021లో మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ ట్రిబ్యునల్‌ మంజారు చేసిన నష్ట పరిహారానికి వ్యతిరేకంగా బీమా కంపెనీ ఈ పిటీషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఎన్‌ ఆనంద్‌ వెంకటేష్‌ ఈ మేరకు సోమవారం తీర్పు చెప్పారు. హెల్మెట్‌ ధరించలేదనే కారణంతో విద్యార్థి కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారాన్ని ట్రిబ్యునల్‌ కొంతమేర తగ్గించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోస్టు మార్టరం నివేదిక ప్రకారం తలకు తగిలిన గాయాలతోపాటు శరీరంలో ఇతర భాగాల్లో తగిలిన గాయాలు కూడా విద్యార్థి మృతికి కారణమని, కాబట్టి బాధిత కుటుంబానికి పూర్తి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థి ఆదాయాన్ని రూ.12 వేలుగా ట్రిబ్యునల్‌ లెక్కించగా, భవిష్యత్‌ అవకాశాలను సహేతుకంగా పరిగణనలోకి తీసుకుని నెలసరి ఆదాయాన్ని రూ.16,800గా లెక్కించాలని ఆదేశించారు. కుమారుడ్ని కోల్పోయినందుకు మరో రూ.1.2 లక్షలను ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థి బతికి ఉంటే చేసే వ్యక్తిగత ఖర్చులను తీసివేసి, మిగిలిన మొత్తాన్ని ఆరు వారాల్లోగా అతని కుటుంబానికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

➡️