ఢిల్లీలో భారీ ఎత్తున బలగాల మోహరింపు

Massive deployment of forces in Delhi

రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా ఉందని కేంద్రం అంగీకరించింది: రైతు నాయకులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధానికి రైతులు చేరుకోకుండా అడ్డుకోవడానికి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించడాన్ని రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యతో రైతు ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉందని కేంద్రం అంగీకరించిందని రైతు నేత సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ పేర్కొన్నారు. బుధవారం నాడు అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశంలో రైతు నేత సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 100 మంది రైతులు ఢిల్లీకి వెళ్లే సమయంలో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిర్బంధించబడ్డారని పంధేర్‌ పేర్కొన్నారు. ”ఢిల్లీలో భారీ బలగాలను మోహరించడంతో రైతు ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉందని, పంజాబ్‌, హర్యానాకు మాత్రమే పరిమితం కాదని ప్రభుత్వం అంగీకరించింది” అని అన్నారు. ”దూర రాష్ట్రాల నుండి రైతులు రైలు లేదా ఇతర మార్గాల్లో చేరుకుని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు దిగాలని నిర్ణయించాం. ఈ ఆందోళన పంజాబ్‌కే పరిమితం అని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు నిషేధం ఎందుకు అని మేము అడగాలనుకుంటున్నాము. జంతర్‌ మంతర్‌, ఢిల్లీలోని మరికొన్ని ప్రాంతాలలో సెక్షన్‌ 144 కింద ఆంక్షలు విధించింది. టిక్రీ, సింఘూ సరిహద్దుల్లో ఎందుకు భారీగా బారికేడ్లు వేశారు. ఈ ఆందోళన పంజాబ్‌, హర్యానా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉందని కేంద్రం అంగీకరించింది” అని పంధర్‌ అన్నారు. ”అందుకే వారు చాలా బలగాలను మోహరించారు. నిషేధాజ్ఞలు విధించారు. వారు రైతులను ఢిల్లీలోకి రానివ్వబోమని కూడా చెప్పారు” అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న శంభు, ఖానౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద కార్యక్రమాలు జరుపుకుంటామని, ఇందులో మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పంధేర్‌ తెలిపారు. వివిధ డిమాండ్లకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళన గురించి, హర్యానాలోని వివిధ ఖాప్‌ పంచాయతీలు కూడా తమకు మద్దతు ఇచ్చాయని అన్నారు. అలాగే 100 మందికి పైగా రైతుల సోషల్‌ మీడియా ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు. లఖింపూర్‌ ఖేరీలో రైతులు ఎవరూ ఢిల్లీ వైపు వెళ్లకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పంధేర్‌ ఆరోపించారు. ఈ నెల 10న పంజాబ్‌లోని అన్ని జిల్లాల్లో ‘రైల్‌ రోకో’ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

➡️