మోడీ ఓ నియంత- ఆయన ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిందే

Apr 1,2024 00:30 #crowded, #Ramlila Maidan

-దేశ ప్రజానీకానికి ఇండియా ఫోరమ్‌ పిలుపు
-ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజానీకం
-కిక్కిరిసిన చారిత్రత్మక రామ్‌లీలా మైదాన్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :’ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ నియంత. మతం పేరుతో సమాజాన్ని చీలుస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసి, ప్రతిపక్షాలను వేటాడుతున్నారు. ఏకపక్ష విధానాలతో అధికారంలో కొనసాగాలని చూస్తున్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అప్రకటిత ఎమర్జన్సీని ప్రతిఘటించాలి. మోడీ సర్కారును గద్దెదించాలి. అని దేశ ప్రజానీకానికి ఇండియా ఫోరమ్‌ నేతలు పిలుపునిచ్చారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ నినాదంతో ఆదివారం ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా ఫోరమ్‌ నిర్వహించిన మహార్యాలీ, బహిరంగ సభకు ప్రజానీకం వెల్లువెత్తింది. కేవలం 20 వేల మందికే అనుమతిస్తామని ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలను ప్రజానీకం ఏమాత్రం ఖాతరు చేయలేదు. లక్షలాది మంది తరలిరావడంతో రామ్‌లీలా మైదాన్‌ నిండిపోయింది. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాదుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటమన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి విషం. దానిని రుచి చూడకండి. వారు దేశాన్ని నాశనం చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. ”దేశంలో బిజెపి నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యింది. మీరంతా నియంతృత్వం కోరుకుంటున్నారా..? ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారా..?’ అని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఖర్గే ప్రశ్నించారు. ఈ ఏన్నికల్లో బిజెపికి ఓటువేస్తే ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టేనని ఆయన అన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వానికి ఇది ఒక వేదిక. మన భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అందుకే ఈ ర్యాలీని నిర్వహించాం.’ అని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యంగా వ్యవహరించాలని అప్పుడే బిజెపిని ఓడించగలమని అన్నారు.
రాజ్యాంగాన్ని హైజాక్‌ చేశారు: రాహుల్‌
క్రికెట్‌ లో ఫిక్సింగ్‌ తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి, ముగ్గురు, నలుగురు క్రోనీ క్యాపిటలిస్టులు కుమ్మక్కయి రాజ్యాంగాన్ని హైజాక్‌ చేశారని దుయ్యబట్టారు. ప్రజలు పూర్తి స్థాయిలో ఓటు వేయకుంటే వారి కుమ్మక్కు ఫలిస్తుందని, అదే జరిగితే రాజ్యాంగం కూలిపోతుందని పేర్కొన్నారు. ఇవిఎంల రిగ్గింగ్‌, సోషల్‌ మీడియా అవకతవలకు, మీడియాపై ఒత్తిడిని అడ్డుకుంటే బిజెపికి 180 సీట్లు దాటవని అన్నారు.
ఇండియా గెలుస్తుంది : సీతారాం ఏచూరి
ఇండియా ఏకమవుతుందని, ఇండియా గెలుస్తుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ‘భారత్‌ ఏకమై గెలుస్తుంది’ అన్నది ఇండియా ఫోరం నినాదంగా మారిందన్నారు. 49 ఏళ్ల క్రితం రాంలీలా మైదానంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ నిర్వహించిన లెజెండరీ ర్యాలీకి ప్రస్తుత ఇండియా ఫోరం ర్యాలీకి ఎంతో పోలిక ఉందని చెప్పారు. ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తరిమికొడతారని చెప్పారు.ఈస్టర్‌ పునరుత్థాన దినమని, దేశ పునరుత్థానం రాంలీలాతో ప్రారంభమవుతుందని అన్నారు. ‘1975 ర్యాలీలో జెపి స్వేచ్ఛ, బానిసత్వం నిర్మూలన అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ రోజు మళ్లీ అదే నినాదం ఎత్తాల్సిన సమయం వచ్చింది.’ అని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుందని, అవినీతి రాజ్యమేలుతోందని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆకలి పెరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే ఈ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు.
‘క్షీరసాగర మథనంలో అమృత కలశం మొదట దుష్టశక్తుల చేతికి చేరింది. అది ప్రస్తుత పరిస్థితి. దుష్ట శక్తుల నుండి అమృత కలశాన్ని స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే నిజమైన అమృతకాలం సాధ్యమవుతుంది. మతతత్వ శక్తులను ఓడించడం ద్వారానే భారతదేశాన్ని రక్షించగలం’ అని చెప్పారు.
దేశాన్ని రక్షించడమే ప్రస్తుత కర్తవ్యం : డి రాజా
సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ, బిజెపిని తరిమికొట్టి దేశాన్ని రక్షించడం భారతీయ సమాజ కర్తవ్యమని అన్నారు. ”ఇడి, ఇతర కేంద్ర సంస్థలు ప్రతిపక్షాలను వేటాడుతున్నాయి. కేజ్రీవాల్‌, సోరెన్‌ల అరెస్టులే అందుకు నిదర్శనం. రాజకీయ నాయకులు రాజ్యాంగ నైతికతను పాటించాలని అంబేద్కర్‌ చెప్పారు. మోడీకి ఆ నైతికత ఉందా? అని అడుగుతున్నాం. దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. రాజ్యాంగాన్ని మార్చి, దేశాన్ని మత రాజ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల్లో బిజెపిని ఓడించి లౌకికవాదాన్ని కాపాడాలి” అని పిలుపునిచ్చారు.

ఓట్లతోనే దేశాన్ని కాపాడుకోగలం: అఖిలేష్‌
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధాలకోరు పార్టీ బిజెపి అని మండిపడ్డారు. 400 సీట్లు దాటాలని నినాదాలు చేస్తున్న వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌లను ఎందుకు అరెస్టు చేసి జైలుకు పంపారని ప్రశ్నించారు. ” మీ ఓటు మాత్రమే మన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, 90 శాతం జనాభాను కాపాడుతుంది” అని ప్రజల నుద్ధేశించి అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : చంపై సోరెన్‌
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు వేయాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ పిలుపు ఇచ్చారు. బిజెపి నియంతృత్వం, భావజాలం ఎదగనివ్వబోమన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రజల కోసం పనిచేస్తున్నందుకు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారని చెప్పారు.
రెండు ఖాళీ కుర్చీలు
వేదికమీద మెదటివరుసలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జార్ఖాండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ల కోసం రెండు కుర్చీలను ఖాళీగా వదిలారు. కేజ్రీవాల్‌ సతీమణి సునీత, హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన ఈ సమావేశంలో పాల్గన్నారు. శనివారం కేజ్రీవాల్‌ను కలిసిన సునీత ఆయన సందేశాన్ని వినిపిస్తున్నప్పుడు సభలో ఉద్వేగ భరితవాతావరణం నెలకొంది. హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన కూడా బిజెపిపై విరుచుకుపడుతూ మాట్లాడారు. బిజెపికి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని చెప్పారు.
కేజ్రీవాల్‌ ఆరు హామీలు
ఎన్నికలలో ఇండియా ఫోరమ్‌లో గెలిస్తే అమలు చేసే ఆరు హామీలను కేజ్రీవాల్‌ తరపున ఆయన భార్య సునీత ఈ సభలో ప్రకటించారు. పేదలకు నిరాటంకంగా ఉచిత విద్యుత్‌, ప్రతి గ్రామంలోనూ అత్యున్నత స్థాయి ప్రభుత్వ పాఠశాలలు, నైబర్‌హుడ్‌ క్లీనిక్‌లు, మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. తాను ఇడి కస్టడీలో ఉన్నందున ఫోరమ్‌లోని మిగిలిన పార్టీల నేతలతో సంప్రదించడానికి వీలు లేకుండా పోయిందన్నారు.
కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఐ (ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే, డిఎంకె నేత తిరుచ్చి శివ, టిఎంసి నేత డెరిక్‌ ఓబ్రెయిన్‌, విసికె నేత తిరుమవళవన్‌, ఆప్‌ నేతలు, ఢిల్లీ మంత్రులు గోపాల్‌ రారు, అతిషి, సౌరబ్‌ భరద్వాజ్‌, కైలాష్‌ గెహ్లాట్‌ తదితరులు హాజరయ్యారు.

➡️