మళ్లీ బిజెపి పంచన చేరనున్న నితీష్‌!

Jan 27,2024 10:57 #national, #Nitish Kumar

 రోజంతా జోరుగా ప్రచారం

పాట్నా: బీహార్‌లో మళ్లీ రాజకీయ రంగులు మారుతు న్నాయి. రాజకీయ నిలకడలేనితనానికి మారుపేరుగా మారిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మళ్లీ బిజెప పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.. రిబిప్లక్‌ డేను పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం గవర్నరు ఆనవాయితీగా ఇచ్చే తేనీటి విందుకు నితీష్‌ కుమార్‌ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి , ఆర్జేడి నేత తేజస్వియాదవ్‌ మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. ఈ నెల 28 (ఆదివారం) నాటి బహిరంగ కార్యక్రమాలన్నిటినీ ఆయన రద్దు చేసుకున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలంటూ జెడి(యు), బిజెపి రెండూ తమ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అత్యవసర సమన్లు జారీ చేశాయి. రాజకీయాల్లో ఎప్పటిలాగే ఎవరికీ శాశ్వతంగా తలుపులు మూయడం ఉండదని బిజెపికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న సుశీల్‌ మోడీ వ్యాఖ్యానించారు. బిజెపితో జెడి(యు) చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ను ఆ పదవి నుంచి నితీష్‌ తొలగించారు. రోజంతా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. వీటన్నిటిని బట్టి ఆదివారం నితీష్‌ తన మంత్రివర్గాన్ని రద్దు చేసి, బిజెపితో కలసి తిరిగి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ఎలాగైనా పట్టు పెంచుకోవాలన్న దాంతో ఇండియా ఫోరమ్‌ నుంచి జెడి(యు)ను తప్పించాలనేది బిజెపి పన్నాగం. దీనికి అంగీకరిస్తే నితీష్‌నే మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగించి, రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను తమ వారికి ఇచ్చుకునేలా ఒక డీల్‌ కూడా కుదిరినట్లు వార్తలొస్తున్నాయి. నితీస్‌ ప్రస్తుతం ఆర్జేడి, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం నడుపుతున్నారు. బిజెపి యేతర ప్రతిపక్షాలన్నిటిని ఐక్యం చేసేందుకు గత ఏడాది నితీష్‌ కృషి చేశారు. పాట్నా వేదికగా ‘ఇండియా’ ఫోరం తొలి సమావేశం నిర్వహించారు. అటువంటి వ్యక్తి హఠాత్తుగా ఎందుకు ఎన్డీయే పంచన చేరేందుకు తహతహలాడుతున్నారో తెలియడం లేదు. ఇంతలోనే ఏం మార్పు వచ్చింది? 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని పదవికి ఎన్డీయే అభ్యర్థిగా మోడీ నామినేట్‌ కావడంతో నితీస్‌ ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. 2015 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జెడీ, కాంగ్రెస్‌తో కలసి మహా ఘటబంధన్‌ తరపున పోటీ చేశారు. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో జెడి(యు) పరిస్థితి దయనీయంగా తయారైంది. దీంతో ముఖ్యమంత్రి పదవి నితీష్‌కు ఇచ్చినా బిజెపి ఆయనకు ప్రాధాన్యతను తగ్గించింది. దీంతో నితీష్‌ ఎన్డీయే కూటమికి రాం రాం చెప్పి ఆర్జేడి, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ బిజెపి వైపు చూస్తున్నారు. ఇండియా ఫోరమ్‌ ఏర్పాటైన దగ్గర నుంచి బిజెపికి భయం పట్టుకుంది. మూలన పడిపోయిన ఎన్డీయేను ‘ఇండియా’ ఫోరమ్‌కు దీటుగా తిరిగి తెరపైకి తెచ్చేందుకు యత్నాలు ప్రారంభించింది. హిందీ బెల్టులో భాగంగా ఉన్న బీహార్‌లో బిజెపి పరిస్థితి ఏమంత బాగోలేదని ఇటీవల ఓ సర్వేలో తేలింది. దీంతో కొత్త పొత్తులు పెట్టుకోవడంతో బాటు, ప్రతిపక్షాలను చీల్చేందుకు అన్ని రకాల ట్రిక్కులను ప్రయోగిస్తోంది. నితీష్‌ను దువ్వడం ద్వారా బీహార్‌లో తన బలాన్ని పెంచుకోవచ్చని బిజెపి ఆశ. కానీ, నితీష్‌ నమ్మదగిన నాయకుడు కాదని, ఆయనతో పొత్తు వద్దని బిజెపి స్థానిక నాయకులు కొందరు పార్టీ అధిష్టానానికి చెబుతున్నారు. నితీష్‌ బిజెపితో చేతులు కలపడంపై జెడి(యు)లో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి నితీష్‌తో పొతు ్త కుదిరినా బిజెపి ఆశించినట్లుగా బీహార్‌లో అది పుంజుకునే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

‘ఇండియా’తోనే ఉన్నాం..కానీ.. : జెడియు

ఇండియా బ్లాక్‌తోనే ఉన్నామని, అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ ‘ఆత్మపరిశీలన’ చేసుకోవాలని జెడి(యు) జెడి(యు) రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్‌ సింగ్‌ కుస్వాహా ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలోకి జెడి(యు) తిరిగి వెళుతుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఉమేష్‌ సింగ్‌ కుస్వాహా ఈ ప్రకటన విడుదల చేశారు. ‘నిన్నటి మాదిరిగానే ఈ రోజు కూడా ముఖ్యమంత్రిని కలిసాను. అలాగే చక్కర్లు కొడుతున్న పుకారుల్లో ఎలాంటి నిజం లేదు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలను పాట్నాకు రమ్మని కోరినట్లుగా వచ్చిన పుకార్లను కూడా మేం తిరస్కరిస్తున్నాం’ అని కుస్వాహా తెలిపారు. శుక్రవారం రిపబ్లిక్‌ పరేడ్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ దూరంగా, దూరంగా కూర్చోవడాన్ని కుస్వాహా తెలిగ్గా తీసుకున్నారు. ఇండియా బ్లాక్‌తో కలిసే ఉన్నామని అన్నారు. ‘అయితే వేదికలోని కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలు, సీట్ల సర్దుబాటుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు వీలుగా సీట్ల పంపకాల ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని మా నాయకులు నితీష్‌ కుమార్‌ చాలా కాలంగా ప్రస్తావిస్తున్నారు’ అని కుస్వాహా పేర్కొన్నారు.

➡️