మోడీ ఫొటో పెట్టలేదని… బెంగాల్‌కు రూ.7 వేల కోట్ల నిధులు నిలిపివేత

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని రేషన్‌ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు పెట్టలేదన్న కారణంతో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏడు వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. నిధులు బదిలీ చేసేందుకు కేంద్రం రెండు షరతులు విధించిందని బెంగాల్‌ ఆహార శాఖ సీనియర్‌ అధికారులు తెలిపారు. అందులో ఒకటి… ప్రతి రేషన్‌ షాపు ముందు మోడీ చిత్రంతో బ్యానర్‌ లేదా ఫ్లెక్సీని ఏర్పాటుచేయాలి. రెండోది… పాయింట్‌- ఆఫ్‌ -సేల్‌ పరికరం నుంచి జారీ అయ్యే అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్పు మీద జాతీయ ఆహార భద్రతా సంస్థ లోగో ఉండాలి. ‘వీటిని బెంగాల్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మొదట కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఆ తర్వాత ఈ పథకం కింద రాష్ట్రానికి డబ్బు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది’ అని ఓ అధికారి చెప్పారు.కేంద్రం నిధులు నిలిపివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటి వరకూ 30శాతం మాత్రమే సేకరించగలిగింది.

➡️