పోలింగ్‌ అధికారిపై దాడి కేసులో బిజెపి ఎమ్మెల్యేకు నోటీసులు

అగర్తలా : త్రిపురలో రెండో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రిసైడింగ్‌ అధికారిపై చేయి చేసుకున్న బిజెపి ఎమ్మెల్యే లాల్‌ నాథ్‌కు ¸ జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఎన్నికల అధికారులు ఈ చర్య తీసుకున్నారు. త్రిపుర తూర్పు లోక్‌సభా నియోజకవర్గానికి ఈ నెల 26న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.ఈ దాడితో ప్రమేయమున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కంజల్‌ దాస్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించి బూత్‌లోకి ఎందుకు ప్రవేశించారు? అధికారిపై ఎందుకు చేయి చేసుకున్నారో తెలియజేయా లంటూ ఎమ్మెల్యేకు ఇచ్చిన నోటీసులో జిల్లా ఎన్నికల అధికారి దేవప్రియ వర్ధన్‌ ఆదేశించారు.
ప్రిసైడింగ్‌ అధికారిని బయటకు లాగి కొట్టారు
పోలింగ్‌ రోజున సాయంత్రం 5గంటల సమయంలో బూత్‌ వద్ద చెల్లాచెదురుగా నిలబడిన ఓటర్లందరూ లైన్‌లో నిల్చొని టోకెన్లు తీసుకోవాలని, 5 గంటల తర్వాత ఓటు వేయడానికి ఇవి తప్పనిసరని ప్రిసైడింగ్‌ అధికారి చెబుతున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కంజల్‌ దాస్‌, ఆయన అనుచరులు బూత్‌ నుండి ప్రిసైడింగ్‌ అధికారిని బయటకు లాగి చేయి చేసుకున్నారని సంబంధిత అధికారి తెలిపారు.

➡️