వైద్యశాఖ సిబ్బందిపై ఎస్మా ప్రయోగించిన ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్‌ :   వైద్యశాఖ సిబ్బంది సమ్మెపై నిషేధం విధిస్తూ బుధవారం అర్థరాత్రి ఒడిశా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. పారామెడికల్‌ సిబ్బంది సహా   నర్సులు, ఫార్మాసిస్ట్స్‌,  ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, క్లాస్‌ 3 మరియు 4 ఉద్యోగుల సమ్మెపై నిషేధం విధించేందుకు ఎసన్షియల్‌ సర్వీసెస్‌ (మెయింటెనెన్స్‌) యాక్ట్‌ (ఎస్మా)ను విధిస్తున్నట్లు ప్రకటించింది.    ఈ ఉత్తర్వులు డిసెంబర్‌ 6 నుండి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

పేద ప్రజలకు, అత్యవసర రోగులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రంలోని వైద్య సేవలకు సంబంధించిన ఉద్యోగుల ( కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సహా) సమ్మెపై నిషేధం విధిస్తున్నట్లు   ఆరోగ్య శాఖ ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక వైద్య సైవా కేంద్రాలు, ప్రభుత్వ గ్రాంట్లతో నిర్వహించే మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు సహా ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో పనిచేసే సిబ్బందికి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే మునిసిపల్‌ ఆస్పత్రులు, ఇఎస్‌ఐ, కటక్‌లోని ఆచార్య హరిహర్‌ రీజనల్‌ కాన్సర్‌ సెంటర్‌, ప్రాంతీయ వెన్నెముక ఆస్పత్రులతో పాటు జైళ్లు, పోలీస్‌ ఆస్పత్రుల సిబ్బంది కూడా నిషేధపు ఉత్తర్వుల పరిధిలోకి వస్తారని ప్రకటించింది.

➡️