బిజెపియేతర రాష్ట్రాల పట్ల వివక్ష లేదు : నిర్మలా సీతారామన్‌

Feb 5,2024 15:31 #nirmala sitharaman

న్యూఢిల్లీ : పన్ను బకాయిల చెల్లింపుల్లో బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్లమెంటులో సోమవారం కాంగ్రెస్‌ ఎంపి అధీర్‌రంజన్‌ ఆరోపించారు. అధీర్‌ రంజన్‌ ఆరోపణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సు ప్రకారమే రాష్ట్రాలకు చెల్లించడం జరుగుతుంది. పన్ను ఆదాయాల కేటాయింపులో రాష్ట్రాల పట్ల నాకు వివక్ష లేదు. రాజకీయంగా రెచ్చగొట్టడానికే అధీర్‌రంజన్‌ ఈ ఆరోపణలు చేశారు. నా ఇష్టానుసారం రాష్ట్రాలకు కేటాయింపులు మార్చుకునే హక్కు నాకు లేదు. నేను వంద శాతం ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులను పాటించాలి. ప్రతి ఆర్థికమంత్రి చేసేది అదే. నాకు ఈ రాష్ట్రం ఇష్టంలేదు.. చెల్లింపును ఆపండి అని జోక్యం చేసుకునే అవకాశం ఏ ఆర్థికమంత్రికి ఉండదు.’ అని ఆమె అన్నారు. సభలో మరోసారి దీనిపై అధీర్‌రంజన్‌ మాట్లాడబోతే.. నిర్మలాసీతారమన్‌ మరింత ఆవేశానికి గురై..’అధీర్‌జీ ఏమైనా సందేహాలుంటే.. దయచేసి ఫైనాన్స్‌ కమిషన్‌తో మాట్లాడండి’ అని చెప్పారు.

➡️