జమ్ము కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ కీలక ఉగ్రవాది మృతి

 శ్రీనగర్‌  :  జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గత 24 గంటలుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం పాకిస్తాన్‌ కీలక ఉగ్రవాది మరణించాడు. మృతుడు అత్యున్నత శిక్షణ పొందిన లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది, పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన క్వారీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కలాకోట్‌లోని బాజీ మాల్‌ వద్ద ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించినట్లు రక్షణ దళాలు తెలిపాయి. గురువారం ఉదయం కూడా శానిటైజేషన్‌ తిరిగి ప్రారంభమైందని పేర్కొన్నాయి.

పాకిస్థాన్‌కు చెందిన క్వారీ.. పాక్‌ – ఆఫ్ఘన్‌ సరిహద్దుల్లో శిక్షణ పొందాడని, లష్కరే తోయిబాలో టాప్‌ ర్యాంకు కలిగిన నేతని జమ్ము డిఫెన్స్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (పిఆర్‌ఒ)తెలిపారు. గత ఏడాది కాలంగా తన  బృందంతో  కలిసి రాజౌరీ- పూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని,  డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అని పేర్కొన్నారు.   గుహల్లో నక్కి ఉగ్రకార్యకలాపాలు నిర్వహించడంలో నిపుణుడని, శిక్షణ పొందిన స్నైపర్‌ కూడా అని పేర్కొన్నారు. రాజౌరీలో బుధవారం  జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.  గత ఆదివారం నుండి కలాకోట్‌లోని అడవుల్లో భద్రతా బలగాలు గాలిస్తున్నాయని ఆర్మీ బుధవారం ఓప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదుల కదలికలపై నిర్దిష్ట నిఘాతో ఈ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు పేర్కొంది. బుధవారం ఉదయం ఉగ్రవాదులను గుర్తించామని, వారితో భీకర కాల్పులు జరిగాయని చెప్పారు.

➡️