Patanjali: రాందేవ్‌ బాబాకు ‘సుప్రీం’ మళ్లీ మొట్టికాయలు

Apr 16,2024 12:57 #Patanjali, #Ramdev Baba, #Supreme Court

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో యోగా గురు రాందేవ్‌ బాబాపైనా, ఆయన అనుచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత బాలకృష్ణపైనా సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాబా రాందేవ్‌ అంత అమాయకుడేం కాదనీ, ఆయనది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ ఎ. అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బాబా రాందేవ్‌, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ”మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాం” అని బాబా రాందేవ్‌ కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ”చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా.. అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా?’ అని ప్రశ్నించింది. దానికి రాందేవ్‌ స్పందిస్తూ.. ” మేము అనేక పరీక్షలు చేశాం” అని కోర్టుకు తెలిపారు. ”మీది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు” అని జస్టిస్‌ హిమా కోహ్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదనీ అని మరో న్యామమూర్తి జస్టిస్‌ ఎ. అమానుల్లా అన్నారు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 23కు వాయిదా వేసింది.

➡️