భూటాన్‌లో ప్రధాని మోడి పర్యటన

Mar 22,2024 10:14 #Bhutan, #PM Modi, #Visit

భూటాన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడి ఒక రోజు ఆలస్యంగా భూటాన్‌ పర్యటనను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన థింపునకు బయలుదేరారు. నిజానికి నిన్ననే ప్రారంభం కావల్సిన పర్యటన అనివార్య కారణాలతో ఒక రోజు ఆలస్యమైంది. తాజా పర్యటనలో భాగంగా భూటాన్‌ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్‌ గ్యాల్పో’ను ప్రధాని మోడికి అందజేయనున్నారు. ఈ అవార్డును మోడికి 2021లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానికి అక్కడకు వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు దానిని స్వయంగా భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ చేతుల మీదుగా ప్రధాని అందుకోనున్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు, కోవిడ్‌ సమయంలో తొలి విడతలోనే 5,00,000 టీకాలను అందజేయడం వంటి చర్యలు తీసుకున్నందుకు ఈ అవార్డును మోడికి ప్రదానం చేస్తున్నారు. భూటాన్‌కు మోడి చేరుకున్నాక అక్కడి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇంధన వినియోగం, ఆహార సురక్షిత ప్రమాణాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. థింపులో భారత నిధులతో నిర్మించిన ఆస్పత్రిని మోడి ప్రారంభించనున్నారు. ఆ దేశ 13వ పంచవర్ష ప్రణాళిక, వివిధ రంగాల్లో భారత్‌ అందించాల్సిన సాయంపై చర్చలు జరగనున్నాయి. అస్సాం సమీపంలోని భూటాన్‌లో ‘గెల్పూ మైండ్‌ఫుల్‌నెస్‌ సిటీ’ నిర్మాణం అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రానుంది.

➡️