ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై ఉక్కుపాదం

police attack on teachers candidates in UP

టీచర్‌ పోస్టుల భర్తీ కోసం బిజెపి ఆఫీస్‌ ముట్టడించిన యువత
బలవంతంగా లాగిపడేసిన పోలీసులు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై అక్కడి బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్‌తో బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని వందలాది మంది అభ్యర్థులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అభ్యర్థులపై పోలీసుల్ని బిజెపి ప్రభుత్వం ప్రయోగించింది. అభ్యర్థులపై పోలీసులు కనికరం లేకుండా దాడి చేశారు. బలవంతంగా బయటకు లాగి పడేశారు. అనేక మందిని అరెస్టు చేసి ఎకో గార్డెన్‌ పార్కుకు తరలించారు. బిజెపి కార్యకర్తలు కూడా టీచర్‌ అభ్యర్థులపై దాడి చేశారు. 69 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రారంభించిన రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో కొన్ని నెలల నుంచి ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ డైరెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నివాసం వద్ద కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. 2020 జూన్‌లో 69 వేల మందితో కూడిన టీచర్ల మెరిట్‌ను విడుదల చేశారు. దీనిపై అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో 6,800 మంది రిజర్వ్‌డ్‌ కేటగిరి అభ్యర్థులతో కూడిన ఒక మెరిట్‌ జాబితాను ఈ ఏడాది మార్చిలో అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ రద్దు చేసింది. మొత్తం మెరిట్‌ జాబితాను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ పని చేయడం లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు భూపేంద్ర సింగ్‌ చౌదరిని కలవడానికి బిజెపి కార్యాలయానికి చేరుకున్నామని, అయితే బిజెపి కార్యకర్తలు, పోలీసులు తమపై దాడి చేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మా డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర అసెంబ్లీ వద్ద మేం ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని అభ్యర్థులు హెచ్చరించారు.

➡️