‘ పిహెచ్‌డి సబ్జీవాలా’

Jan 1,2024 14:14 #PhD Sabzi Wala, #Punjab Man

చంఢీఘర్  :    ‘పిహెచ్‌డి సబ్జీవాలా’ అనే బోర్డుతో . ఓ వ్యక్తి పంజాబ్‌లో కూరగాయలు విక్రయిస్తున్నాడు. డా. సందీప్‌ సింగ్‌ (39) నాలుగు మాస్టర్‌ డిగ్రీలు, పిహెచ్‌డి చేశారు. పాటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. అయితే ఒక్క నెల కూడా పూర్తి జీతం అందుకోలేదు. దీంతో కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగం మానేసి ఈ వృత్తిని ఎంచుకున్నారు.

డా. సందీప్‌ సింగ్‌ పంజాబ్‌ యూనివర్శిటీలోని న్యాయ విభాగంలో 11 ఏళ్ల పాటు కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన న్యాయశాస్త్రంలో పిహెచ్‌డి, పంజాబ్‌ జర్నలిజమ్‌, పొలిటికల్‌ సైన్స్‌లో నాలుగు మాస్టర్‌ డిగ్రీలు చేశారు. ఇప్పటికీ చదువు కొనసాగిస్తున్నారు. సమయానికి జీతం రాకపోవడం, జీతాల్లో కోత పెట్టడంతో ఏ నెల కూడా పూర్తి జీతం పొందలేదని అన్నారు. ఇక ఇదే ఉద్యోగంలో కొనసాగితే జీవనం కష్టంగా మారుతుందని భావించి, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు, బతుకుదెరువు కోసం కూరగాయలు విక్రయిస్తున్నానని చెప్పారు.

తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయల విక్రయం ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పారు. కూరగాయల అమ్మకం అనంతరం ఇంటికి వెళ్లి మళ్లీ పరీక్ష కోసం ప్రిపేర్‌ అవుతుంటానని అన్నారు. అధ్యాపక వృత్తికి విరామం ఇచ్చినా ఇప్పటికీ తన అభిరుచిని వదులుకోలేదు. ఎప్పటికైనా మంచి ట్యూషన్‌ పాయింట్‌ పెట్టాలనేది తన ఆశయమని అన్నారు.

➡️