ఫలితాలొచ్చాకే ‘ప్రధాని’పై నిర్ణయం : రాహుల్‌ గాంధీ

Apr 6,2024 00:10 #Congress, #Rahul Gandhi

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మీడియా ప్రచారం చేస్తున్నట్లు కాకుండా చాలా పోటాపోటీగా ఈ ఎన్నికలు ఉండనున్నాయని, ఎన్నికల్లో తమ గెలుపు (ఇండియా ఫోరమే) ఖాయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాతే ‘ఇండియా’ ఫోరం ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న శక్తులకు, వాటిని పరిరక్షించే శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే 2024 లోక్‌సభ ఎన్నికలని అన్నారు. బిజెపి మేనిఫెస్టోలో ఒక శాతంగా ఉన్న అదానీ వంటివారు కోరుకున్నవి ఉంటాయని, తమ మేనిఫెస్టోలో మాత్రం మిగతా 99 శాతం ప్రజలు కోరుకునేవి ఉన్నాయని అన్నారు. నాలుగు పెద్ద కార్పొరేట్‌ సంస్థల కోసం దేశం కాదని, వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా తాము చూస్తామని అన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీలంటే.. కాంక్రీట్‌ గ్యారంటీలని ఆయన అన్నారు. గత యుపిఎ హయాంలో పదేళ్లలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత, విద్యా హక్కు, సమాచార హక్కు చట్టాలు అందుకు కొన్నిమచ్చుతునకలని ఆయన పేర్కొన్నారు. మోడీ పదేళ్ల పాలనలో పేదల కోసం ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు. చందా తీసుకురా? కాంట్రాక్టు తీసుకో! అన్నదే బిజెపి విధానమని కాంగ్రెస అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ఆ పార్టీ వాషింగ్‌ మెషీన్‌లా మారిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో చేరగానే ఎన్ని కేసులున్నా సరే క్లీన్‌ అయిపోతాయని అన్నారు. ఇటు దర్యాప్తు సంస్థలతో బెదిరించి, అటు దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు.

మోడీ పాలనలో అన్ని అన్ని రంగాలు ధ్వంసం : చిదంబరం
గత పదేళ్ల మోడీ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ చిదంబరం విమర్శించారు. బిజెపి గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయమూ జరగలేదన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని అన్నారు. ‘గత పదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా తమ పార్టీ మేనిఫెస్టోను సిద్ధం చేశామన్నారు. యుపిఎ పాలనలో దేశం 8.5 శాతం వృద్ధి సాధించగా, మోడీ పాలనలో ఇది 5.9 శాతానికి పడిపోయిందని అన్నారు.

➡️