Electoral bonds : ఎట్టకేలకు నంబర్లతో ఇసికి బాండ్ల వివరాలు

– సుప్రీంకోర్టు ఆదేశాలతో అందజేసిన ఎస్‌బిఐ
– ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ సమర్పణ
– ఖాతాలు, కెవైసి వివరాలు ఇవ్వలేమని వెల్లడి
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను యూనిక్‌ నంబర్లుతో సహా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బిఐ) గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఇసి)కి అందజేసింది. అయితే కంపెనీల ఖాతాల వివరాలను, నో యువర్‌ కస్టమర్‌ (కెవైసి) వివరాలను సైబర్‌ భద్రత రీత్యా ఇవ్వలేమని తెలిపింది. ఈ మేరకు ఎస్‌బిఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా సుప్రీంకోర్టులో కంప్లీయన్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశానుసారం ‘పూర్తి వివరాలు అందజేశా’మని ఆయన తెలిపారు. బాండ్లను ఎవరు కొనుగోలు చేశారు, వాటిని ఏయే పార్టీలు నగదుగా మార్చుకున్నాయి వంటి ముఖ్యమైన వివరాలను సరిపోల్చడానికి యూనిక్‌ నెంబర్లు ఉపకరిస్తాయి. ఎస్‌బిఐ అందించిన వివరాల్లో కొనుగోలుదారుని పేరు, బాండ్‌ సీరియల్‌ నెంబరు, యూఆర్‌ఎన్‌ నెంబరు, జర్నల్‌ తేదీ, కొనుగోలు చేసిన తేదీ, ఎక్స్‌పయిరీ తేదీ, బాండ్‌ విలువ, బాండును జారీ చేసిన బ్రాంచ్‌ కోడ్‌, ఇష్యూ టెల్లర్‌, స్టేటస్‌కు సంబంధించిన సమాచారముంది. బాండును నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల వివరాలను కూడా అందులో పొందుపరిచారు. బాండ్‌ సీరియల్‌ నెంబరు, నగదుగా మార్చుకున్న తేదీ, రాజకీయ పార్టీ పేరు, అకౌంట్‌ నెంబరులో చివరి నాలుగు అంకెలు, బాండ్‌ నెంబరు, దాని విలువ, చెల్లించిన బ్రాంచ్‌ కోడ్‌, పే టెల్లర్‌ సమాచారం అందులో ఉంది. రాజకీయ పార్టీల బ్యాంక్‌ ఖాతా పూర్తి నెంబరును, కెవైసి వివరాలను బహిర్గతం చేయడం లేదని, ఖాతాల భద్రత దృష్ట్యా వీటిని అందించడం లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎస్‌బిఐ చైర్మెన్‌ తెలియజేశారు. అదేవిధంగా కొనుగోలుదారుల కెవైసి వివరాలను కూడా బయటపెట్టడం లేదు. అయితే రాజకీయ పార్టీల గుర్తింపునకు ఈ వివరాలు అవసరం లేదని ఆయన తెలియజేశారు. ‘ఎస్‌బిఐ ఇప్పుడు అన్ని వివరాలూ వెల్లడించింది. బ్యాంక్‌ ఖాతాల పూర్తి నెంబర్లు, కెవైసి వివరాలు మినహా ఏ సమాచారాన్నీ దాచలేదు’ అని ఆయన అందులో తెలియజేశారు. పూర్తి వివరాలు వెల్లడించడంలో దాటవేత వైఖరిని అవలంబిస్తూ వచ్చిన ఎస్‌బిఐపై ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ నెల 21లోగా పూర్తి వివరాలు అందజేయాల్సిందేనంటూ ఎస్‌బిఐని ఆదేశించిన నేపథ్యంలో ఎస్‌బిఐ ఈ వివరాలు సిఇసికి సమర్పించాల్సివచ్చింది.

➡️