ప్రజ్వల్‌ అఘాయిత్యాలపై మౌనమా?

May 6,2024 00:01 #coments, #PM Modi, #priyanka gandhi
  •  మోడీ, అమిత్‌ షాలపై ప్రియాంక గాంధీ విమర్శ

హుబ్బాళి : తమ మిత్రపక్షమైన జనతాదళ్‌(ఎస్‌)లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అస్సలేమీ తెలియనట్లే ప్రధాని మోడీ, అమిత్‌షా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. కర్ణాటకలో ప్రజ్వల్‌ అఘాయిత్యాలకు సంబంధించి మిత్రపక్షం పాత్రపై వారు మౌనం పాటించడాన్ని ఆమె ప్రశ్నించారు. దావణగెరెలో ఎన్నికల సభలో మాట్లాడుతూ వందలాదిమంది మహిళలపై అత్యాచారాలు చేసిన ఆ వ్యక్తి కోసమే ప్రధాని మోడీ ప్రచారం చేశారని చెప్పారు. అన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత దేశం నుండి తప్పించుకోవడానికి కూడా అనుమతించారని విమర్శించారు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లే వ్యవహరిస్తున్నారని అన్నారు.
మహిళలకు సాధికారత, మహిళలకు రక్షణ అంటూ మోడీ తన ప్రసంగాల్లో చాలా గొప్పలు చెబుతారని చెప్పారు. అమల్లోకి వచ్చేసరికి వారికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కనీసం మాట్లాడను కూడా లేదని అన్నారు. అణచివేతకు గురైన వారికన్నా అణచివేతకు పాల్పడిన వారికే ఆయన అండగా వుంటున్నారని విమర్శించారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలిస్తూ వుంటే ప్రధాని అకస్మాత్తుగా ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల గురించి మాట్లాడడం ప్రారంభించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంతలా బాగా లేదనుకున్నప్పుడు రూ.16 లక్షల కోట్ల కార్పొరేట్‌ మిత్రుల రుణాలను ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు.

➡️