ఫ్రెంచి జర్నలిస్టు పిటిషన్‌పై వైఖరి తెలియచేయండి

Mar 5,2024 08:02 #Journalist, #Supreme Court
  • కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : భారత్‌లో జర్నలిస్టు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తనకు అనుమతిని నిరాకరించడానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్‌ జర్నలిస్టు వానెసా డొగ్‌నాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరిని తెలియచేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు సోమవారం కోరింది. వానెసా ఒసిఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా) కార్డును కలిగివున్నారు. ఆమె పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ స్పందన తెలియచేయాలని కేంద్రాన్ని కోరారు. ఒసిఐ కార్డు దారుని హక్కుకు సంబంధించిన అంశమైనందున దీనిపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరముందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎలాంటి నిర్దిష్ట కారణాన్ని చెప్పకుండానే డొగ్‌నాక్‌ దరఖాస్తును పక్కకుపెట్టేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వృందాభండారి అన్నారు. పిటిషనర్‌ 23ఏళ్ళుగా భారత్‌లో జీవిస్తున్నారని, పైగా ఆమె భారతీయ పౌరుడిని వివాహం చేసుకున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఒసిఐ కార్డును కలిగిన వారు జర్నలిస్టు కార్యకలాపాలు చేపట్టరాదని, అందుకోసం జరులిస్టు వీసా తీసుకోవాల్సి వుంటుందని, ఇందుకు సంబంధించి చట్టం స్పష్టంగా వుందన్నారు. ఆమె ఒసిఐ హోదాను రద్దు చేయడంపై, భారత్‌ను చెడ్డగా చిత్రీకరిస్తూ ఆమె అతిగా చేస్తున్న ప్రచారంపై కూడా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వుందని చెప్పారు.

➡️