బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఇవిఎం ఓట్లతో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిపిఎటి) స్లిప్‌లను క్రాస్‌ వెరిఫికేషన్‌ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించింది. ‘బ్యాలెట్‌ పేపర్ల సమయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మీరు మరిచిపోయినా.. మేము మరిచిపోలేదు” అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేమని పేర్కొంది. యూరోపియన్‌ దేశాలు ఇవిఎంలను పక్కనపెట్టి బ్యాలెట్‌ పేపర్లకు తిరిగి వచ్చాయని పిటిషన్‌దారులల్లో ఒకరు, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు గుర్తుచేయగా, జర్మనీలో ఓటర్లు 6 కోట్లు అని, మన దేశంలో ఓటర్లు 97 కోట్ల మంది ఉన్నారని, బ్యాలెట్‌ పేపర్లను తీసుకువస్తే ఏమవుతుందో అందరికీ తెలుసునని ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎన్‌జిఒ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సహా పలువురు ప్రముఖ న్యాయవాదులు ఈ పిటిషన్‌లను దాఖలు చేశారు.

➡️