స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం

అమేథీ : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నోరోజులు చర్చలు జరిపి అమేథీ, రారుబరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రారుబరేలీ నుంచి రాహుల్‌ గాంధీ, అమేథీ నుంచి కిశోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి బరిలోకి దిగిన కెఎల్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం. ఇది నేను చేస్తున్న పెద్ద ప్రకటన. నేను అమేథీ నుంచి పోటీ చేయడమనేది అధిష్టానం నిర్ణయం.’ అని అన్నారు. కాగా, కెఎల్‌ శర్మ 1983లో రాజీవ్‌ గాంధీతో కలిసి పనిచేశారు. 1991లో రాజీవ్‌ గాంధీ తర్వాత కెప్టెన్‌ సతీష్‌ శర్మతో కలిసి అమేథీలో పనిచేశారు. ఆ తరువాత సోనియగాంధీ 1999లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రారుబరేలీ, అమేథీ రెండుస్థానాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. గాంధీయేతర కుటుంబ సభ్యులు అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి. గతంలో 1991లో ఈ స్థానం నుంచి సతీష్‌ శర్మ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో రాహుల్‌గాంధీ ఓడిపోయే వరకు అమేథీ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచింది.

➡️