ఫిరాయింపు చట్టం మరింత కఠినతరం

  • కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హామీ

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : సీనియర్‌ నేతలు పార్టీని వీడటం వల్ల అలసిపోయిన కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయించిన నేతలను తక్షణమే అనర్హులుగా ప్రకటించే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనే సెక్షన్‌లో ఈ ఫిరాయింపుల గురించి పేర్కొంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరిస్తామని, పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించేలా చట్టం తెస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న గౌరవ్‌ వల్లభ్‌ కూడా మేనిఫెస్టో విడుదలకు ఒకరోజు ముందు బిజెపిలో చేరారు. నేతల ఫిరాయింపుల ప్రభావం కాంగ్రెస్‌పై ఎక్కువగా ఉంది. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టగానే ఆమె బిజెపిలోకి ఫిరాయించారు. కేరళకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బిజెపిలో ఆశ్రయం పొందారు. మాజీ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్‌ కుమార్తె పద్మజా వేణుగోపాల్‌, కేరళ మాజీ ముఖ్యమంత్రి మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ కూడా బిజెపి శిబిరంలో చేరారు.కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి బీహార్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజరు కపూర్‌ మార్చి 13న బిజెపిలో చేరారు. మార్చి 11న మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు బిజెపిలోకి మారారు.రాజస్థాన్‌లోని ఇద్దరు మాజీ మంత్రులు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సహా 25 మంది కాంగ్రెస్‌ నేతలు మార్చి 10న బిజెపిలో చేరారు.
కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమంత్రులుగా పని చేసి, ఆ తరువాత బిజెపిలోకి ఫిరాయించిన వారిలో ఎస్‌ఎం కష్ణ, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, విజరు బహుగుణ, దిగంబర్‌ కామత్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పెమా ఖండూ, ఎన్డీ తివారీ, జగదాంబికాపాల్‌, అశోక్‌ చవాన్‌ ఉన్నారు. వారిలో ప్రేమ ఖండూ ముఖ్యమంత్రిగా ఉండగానే రూటు మార్చిన వ్యక్తి. వారిలో అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవి తర్వాత కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించి ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు. ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గతంలో మూడు సార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా , రెండు సార్లు మంత్రిగా ఉన్నారు. 2014లోబిజెపిలో చేరిన ఆయన 2021 నుంచి అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు.మణిపూర్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించారు.

➡️