రాజస్థాన్‌ పోలింగ్‌ : మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌

Nov 25,2023 04:34 #celebrities, #Polling, #Rajasthan, #voted

 

  • జైపూర్‌ : రాజస్థాన్‌లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తిజారా జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా 69.37 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత టోంక్‌ జిల్లాలో 56.83 శాతం, రాజధాని జైపూర్‌ నగరంలో 55.75 శాతం, జైసల్మేర్‌లో 63.48 శాతం, ఝులావర్‌లో 60.47 శాతం, హనుమాన్‌గఢ్‌లో 61.64 శాతం, జలోర్‌లో 52.23 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • రాజస్థాన్‌లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకు 40.27 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. 199 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. కాగా, శాంతియుతంగా ఓటింగ్‌ జరిగేందుకు 1,02,209 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు అధికారి తెలిపారు. ఇందులో 69,144 మంది పోలీసు సిబ్బంది, 32,876 మంది రాజస్థాన్‌ హోంగార్డ్స్‌, ఫారెస్టు గార్డ్‌, ఆర్‌ఎసి సిబ్బందితో పాటు కంపెనీల సిఎపిఎఫ్‌లు 700మంది మోహరించినట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

  • శనివారం రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద క్యూ కట్టారు. శనివారం ఉదయం 11.30 గంటలకు 24.74 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటేసిన ప్రముఖులు

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటల నుండి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 199 స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి హఠాన్మరణంతో పోలింగ్‌ వాయిదా పడింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓటు వేసిన పలువురు ప్రముఖులు…కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ జైపుర్‌లోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన టోంక్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ తూర్పు బికనేర్‌లో ఓటేశారు. క్యూలైన్‌లో నిల్చుని ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిజెపి ఎంపి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ జైపుర్‌లో ఓటేశారు.కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జోధ్‌పుర్‌లో, కైలాశ్‌ చౌధరీ బర్మేర్‌లో ఓటు వేశారు.బిజెపి నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝలావర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.బిజెపి ఎంపి సుభాష్‌ చంద్ర బహేరియా, ఆయన భార్య రంజనాతో కలిసి స్కూటీపై వచ్చి ఓటు వేశారు.బిజెపి ఎంపి, విద్యాధర్‌ నగర్‌ అభ్యర్థి దియా కుమారి జైపుర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

➡️