ఓట్ల క్రాస్‌ వెరిఫికేషన్‌పై పిటిషన్లను 16న విచారించనున్న సుప్రీం

Apr 10,2024 00:01 #Petitions, #The Supreme Court, #votes

న్యూఢిల్లీ : ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిపిఎటి)తో పోలైన ఓట్ల క్రాస్‌ వెరిఫికేషన్‌ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ఈ నెల 16న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. వివిపిఎటి అనేది స్వతంత్ర ఓటు వెరిఫికేషన్‌ వ్యవస్థ. తన ఓటు సరిగ్గా పడిందా? లేదా? అని ఓటరు చూసుకోవడానికి ఇందులో వీలు వుంటుంది. దీంట్లో కాగితం స్లిప్‌ ఇస్తారు. దాన్ని ఓటరు చూసుకోవచ్చు. దాన్ని సీల్డ్‌ కవర్‌లో పెడతారు. వివాదం తలెత్తిన పక్షంలో దాన్ని తెరిచి చూస్తారు. ఇందుకు సంబంధించిన పిటిషన్లు అన్నింటినీ కలిపి వచ్చే మంగళవారం విచారించనున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన బెంచ్‌ తెలిపింది. ఏప్రిల్‌ 19 నుండి ఏడు దశల్లో లోక్‌సభ పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఎన్‌జిఓ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను ఇతర వాటితో కలిపి వచ్చే వారం విచారిస్తామని ఏప్రిల్‌ 3న సుప్రీం తెలిపింది. ప్రస్తుతమున్న పద్ధతి ప్రకారం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి ఎంపిక చేసిన ఐదు ఇవిఎంల నుండి వచ్చిన స్లిప్‌లను మాత్రమే లెక్కిస్తున్నారు. అలాకాకుండా, వివిపిఎటి స్లిప్‌లన్నింటినీ పూర్తిగా లెక్కించాలని కోరుతూ అరుణ్‌ కుమార్‌ అగర్వాల్‌ పెట్టుకున్న పిటిషన్‌పై కేంద్రం, ఎన్నికల కమిషన్‌ నుండి స్పందనలను ఏప్రిల్‌ 1న సుప్రీం కోరింది. ఇప్పుడు ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి ఏప్రిల్‌ 16న విచారించనుంది.

➡️