బిజెపిని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యం

Apr 3,2024 00:17 #BJP Govt, #election, #out

– నామినేషన్‌ దాఖలు సందర్భంగా విజయరాఘవన్‌
తిరువనంతపురం : అత్యంత నిరంకుశంగా, ప్రజాకంటకంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యమని సిపిఎం సీనియర్‌ నాయకులు, పాలక్కడ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థి ఎ విజయరాఘవన్‌ అన్నారు. పాలక్కడ్‌ లోక్‌సభ స్థానం నుంచి వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) తరపున పోటీ చేస్తున్న ఆయన మంగళవారం నాడు తన నామినేషన్‌ పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన డమ్మీ అభ్యర్థిగా కెఎస్‌ సలేఖ నామినేషన్‌ వేశారు. ఇరువురు మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 4తో గడువు ముగుస్తుంది. మిగిలిన ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులు బుధ, గురువారాల్లో నామినేషన్లు వేసే అవకాశముంది. ఈ నెల 5న నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువు ఉంటుంది.
ఈ సందర్భంగా విజయరాఘవన్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యమని తెలిపారు. కేరళలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఇప్పుడు అత్యవసరమని ఆయన తెలిపారు. ఎల్‌డిఎఫ్‌కు పాలక్కడ్‌లో విశేష మద్దతు లభిస్తోందన్నారు. అంతకుముందు నిర్వహించిన ప్రదర్శనలో విజయరాఘవన్‌ వెంట సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎకె బాలన్‌, స్థానిక సంస్థల శాఖ మంత్రి ఎంబి రాజేష్‌, జిల్లా కార్యదర్శి ఇఎన్‌ సురేష్‌ బాబు, రాష్ట్ర కమిటీ సబ్యులు ఎన్‌ఎన్‌ కృష్ణదాస్‌, కెఎస్‌ సలేఖ, ఎమ్మెల్యే ఎ ప్రభాకరన్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి సురేష్‌ రాజ్‌, జెడిఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మురుకదాస్‌ విశ్వనాథన్‌ పాల్గన్నారు. అల్థూర్‌ నుంచి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థి కె రాధాకృష్ణన్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

➡️