మణిపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం లేదు.. కేంద్రమే నడిపిస్తోంది : కాంగ్రెస్‌ ఎంపి బిమోల్‌

Jun 18,2024 15:41 #Bimol Akoijam, #Congress MP, #Manipur

ఇంఫాల్‌ : మణిపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వమే లేదు. ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పాలిస్తోంది. అక్కడ అధికారాలన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపి ఎ.బిమోల్‌ అకోయిజం విమర్శించారు. మణిపూర్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌.బీరెన్‌సింగ్‌కి అధికారిక హోదా కూడా నామమాత్రమే. అందుకే సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి బీరన్‌సింగ్‌ని ఆహ్వానించలేదు అని బిమోల్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఈ పరిణామాలను చూస్తే.. రాష్ట్రంలో చీఫ్‌ సెక్రటరీ, డిజిపి (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌)లే ఉన్నారని, ముఖ్యమంత్రి లేరు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మణిపూర్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై బిమోల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ రాష్ట్ర భద్రతా సమీక్షా సమావేశానికి లెఫ్టినెంట్‌ జనరల్‌ హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ మణిపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతవరకు శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. కానీ కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ని ప్రాధాన్యతలేని రాష్ట్రంగా భావిస్తోంది. రాష్ట్ర అధికారాలన్నీ కేంద్రం తన గుప్పెట్లో ఉంచుకుని.. దౌర్జన్యంగా ప్రదర్శిస్తోంది.’ అని ఆయన అన్నారు.
కాగా, మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్నా.. అక్కడి పరిస్థితిని అదుపుచేయకపోవడం పట్ల ఢిల్లీ మైతీ కోఆర్డినేటింగ్‌ కమిటీ ఆ రాష్ట్ర సిఎం బీరెన్‌ సింగ్‌ని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

➡️