ఇదేనా వికసిత భారత్‌?

Apr 11,2024 04:30 #developed India?, #India
  • పోషకాహార లోపంతో చిన్నారుల కుంగుబాటు
  •  మహిళలు, పిల్లల్లో పెరుగుతున్న రక్తహీనత
  •  ఆకలితో అల్లాడుతున్న శిశువులు
  •  ఆహార సబ్సిడీల్లో కోత
  •  మోడీ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన ‘రిపోర్ట్‌ కార్డ్‌’

న్యూఢిల్లీ : దేశంలోని 81 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందజేయడం ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు గౌరవప్రదమా లేక మాయని మచ్చా? 2023వ సంవత్సరపు అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్‌ 111వ స్థానంలో (మొత్తం 125 దేశాలలో) ఎందుకు ఉంది? దేశంలోని 32 శాతం మంది చిన్నారులు ఎందుకు బరువు పెరగడం లేదు? అంటూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఫ్యాన్‌ ఇండియా (ఫైనాన్షియల్‌ అకౌంటబులిటీ నెట్‌వర్కు ఇండియా) ఎండగట్టింది. పౌర సమాజ సంస్థలు, సంఘాలు, ప్రజా ఉద్యమాలు, పౌరులతో కూడిన ఈ సంస్థ బుధవారం నాడిక్కడ ఈ మేరకు ఒక ‘రిపోర్టు కార్డు’ ను విడుదల చేసింది. ‘ఆహార భద్రత, పౌష్టికాహార రిపోర్టు కార్డు (2014-2024)ను విశ్లేషించిన వారికెవరికైనా ఈ ప్రశ్నలు ఉదయించక మానవని పేర్కొంది. గత పది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, చెప్పుకున్న గొప్పలను ఈ రిపోర్టులో ప్రస్తావించారు.
ప్రభుత్వ పత్రాలు, ప్రకటనలను పరిశీలించిన తర్వాతే రిపోర్టు కార్డును తయారు చేశారు. 2014 ఎన్నికల సమయంలో బిజెపి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇందులో ఉదహరించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామంటూ అందులో బిజెపి హామీలు గుప్పించింది. కానీ పది సంవత్సరాల మోడీ పాలనలో మనకు కన్పిస్తున్న వాస్తవాలేమిటి?

పోషకాహార లోపం…రక్తహీనత
జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) అందజేసిన తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో 36 శాతం మందిలో వయసుకు తగిన విధంగా ఎదుగుదల లేదు. పోషకాహార లోపమే దీనికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. ఆ వయసున్న పిల్లల్లో మరో 32 శాతం మందికి తగినంత బరువు లేదు. 2018లో కేంద్రం ‘అనీమియా ముక్త్‌ భారత్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. పథకాలు కోటలు దాటుతున్నాయి. కానీ, ఆచరణ గడప దాటడం లేదు. అందుకే ఇప్పటికీ మహిళల్లో రక్తహీనత సమస్య అలాగే కొనసాగుతోంది. 2015-16లో 15-49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో 53 శాతం మంది రక్తహీనతతో బాధపడగా 2019-20లో అది 57.2 శాతానికి పెరిగింది.
వాస్తవానికి 67 శాతం మంది చిన్నారుల్లో ఏదో ఒక విధమైన రక్తహీనత (హిమోగ్లోబిన్‌ స్థాయి 11 కంటే తక్కువ) కన్పిస్తోంది. మోడీ హయాంలో 2015-16, 2019-21 మధ్యకాలంలో 6-59 నెలల మధ్య వయస్కులైన చిన్నారుల్లో రక్తహీనత 59 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ను 2014 ఎన్నికల ప్రచారంలో ‘మోడల్‌ రాష్ట్రం’గా పొగిడేశారు. అయితే ఆ రాష్ట్రంలో 6-59 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో రక్తహీనత అత్యధికంగా 80 శాతం ఉండడం గమనార్హం. గుజరాత్‌లోని నర్మద (93.2 శాతం), పంచమహల్‌ (91 శాతం), ఆరావళి (89.5 శాతం) జిల్లాల్లో బాలల్లో రక్తహీనత అధికంగా ఉన్నదని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 నివేదిక స్పష్టం చేసింది.

శిశువులకు అందని ఆహారం
పట్టణాలు, గ్రామాల్లో నివసిస్తున్న పేదలకు…ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు వంటి అట్టడుగు వర్గాల వారికి ఆహార భద్రత అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఎస్సీలు, ఎస్టీల్లో కుంగుబాటుతనం 40 శాతం వరకూ ఉండగా ఇతర సామాజిక తరగతుల్లో ముఖ్యంగా హిందువులకు చెందిన చిన్నారుల్లో అది 30 శాతంగా ఉందని ఫ్యాన్‌-ఇండియా రిపోర్టుకార్డు వివరించింది. ‘గడచిన 24 గంటల కాలంలో ఏ విధమైన ఆహారం లభించని’ 6-23 నెలల మధ్య వయసున్న పిల్లలు మన దేశంలో అధికంగానే ఉన్నారని, ఈ విషయంలో ప్రపంచంలో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని నివేదిక కార్డు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లులు, పిల్లలకు అందజేస్తున్న పోషకాహారాన్ని పెంచడానికి ఉద్దేశించిన పథకాలకు కేంద్రం నిధుల కేటాయింపు పెంచవచ్చు కదా? అసలు ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో వాస్తవాలు ఏమిటి?

మధ్యాహ్న భోజనంలో గుడ్డేది?
మధ్యాహ్న భోజన పథకాన్నే తీసుకుందాం. ఇప్పుడు దీనిని పిం-పోషణ్‌ అని పిలుస్తున్నారు. దీనికి 2013-14లో 0.79 శాతం నిధులు కేటాయిస్తే 2024-25లో విదిల్చింది 0.23 శాతం మాత్రమే. దారుణమైన విషయమేమంటే అభం శుభం తెలియని చిన్నారులకు అందించే ఆహారాన్ని కూడా కాషాయీకరణ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో వారికి పోషక విలువలున్న కోడిగుడ్లు ఇవ్వడం లేదు. ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌-4, ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌-5 నివేదికల మధ్య కాలంలో 21 రాష్ట్రాల పిల్లల్లో కుంగుబాటుతనం పెరిగింది. ఇక ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని చూద్దాం. ఈ పథకంలో లబ్దిదారుల సంఖ్య 2019-20లో 96 లక్షలు ఉండగా 2021-22 నాటికి 61 లక్షలకు పడిపోయింది. అదీకాక ఈ పథకంలో చేరిన మహిళలకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రూ.6,000 అందించాల్సి ఉండగా రూ.5,000 మాత్రమే ఇస్తున్నారు.

అంగన్‌వాడీలపై పని ఒత్తిడి
పిల్లలకు పోషకాహారం సరిగా అందుతోందా, వారు ఆరోగ్యంగా ఉన్నారా అనే విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పర్యవేక్షించే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. పనిచేస్తున్న వారికి సైతం గౌరవవేతనం, ఇతర ప్రయోజనాలు అరకొరగానే ఉంటున్నాయి. దేశంలో 70,444 అంగన్‌వాడీ వర్కర్లు, 1,23,287 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే చెబుతోంది.

ఆహార సబ్సిడీలకూ అంతంతే
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహార సబ్సిడీలకు జరుపుతున్న బడ్జెట్‌ కేటాయింపులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2023-24లో రూ.2.12 లక్షల కోట్లకు అంచనాలను సవరించగా 2024-25లో కేటాయించింది రూ.2.05 లక్షల కోట్లు మాత్రమే. బడ్జెట్‌లో ఆహార సబ్సిడీ కేటాయింపుల్లో మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎడాపెడా కోతలు విధించింది. 2014-15 బడ్జెట్‌లో 6.4 శాతం కేటాయించగా 2024-25లో 4.3 శాతం మాత్రమే కేటాయించారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద దేశంలోని పేదలకు ఐదు కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా అందజేస్తామని జనవరిలో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. దీనిని ఓ చారిత్రక నిర్ణయంగా అభివర్ణించింది. దేశంలో ఆహార, పోషకాహార భద్రతను పటిష్టవంతం చేసేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని కొనియాడింది. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం, అది చేసిన కేటాయింపులు చూస్తుంటే కథ వేరేలా ఉన్నదని అర్థమవుతుంది. దేశ భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన చిన్నారులు నీరసంతో, నిస్సత్తువగా, పేలగా, కుంగుబాటుతనంతో కన్పిస్తుంటే భారత్‌ వికసిస్తుందని ఎలా అనుకోగలం?

➡️