బస్తర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ .. ముగ్గురు మావోయిస్టులు మృతి

May 25,2024 23:30 #3 death, #encounter

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌ఘడ్‌లోని దక్షిణ బస్తర్‌ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. బీజాపూర్‌ జిల్లాలో ఇద్దరు మరణించగా, మరొకరు పొరుగున గల సుక్మా జిల్లాలో చనిపోయాడని తెలిపారు. బీజాపూర్‌లో జప్పెరమార్కా-కంకానర్‌ గ్రామాలకు సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా జిల్లా స్థాయి రిజర్వ్‌ గార్డ్‌ (డిఆర్‌జి) బృందం అక్కడ మోహరించింది. కాల్పుల సమయంలో 15 మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో వున్నారని సమాచారం అందడంతో ఆపరేషన్‌ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిన తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను డిఆర్‌జి బృందం స్వాధీనం చేసుకుంది. వాటితో పాటూ ఆయుధాలు, వైర్‌లెస్‌ సెట్‌లు, బ్యాగ్‌లు, మావోయిస్టుల యూనిఫారం, మందులు, రోజువారీ వాడే సామాన్లను ఆ ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలోని బెల్‌పోచా గ్రామ సమీపంలో మరో ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడని సుక్మా ఎస్‌పి కిరణ్‌ చవాన్‌ తెలిపారు. 26న ఆ సమీప గ్రామాల్లో మావోయిస్టులు బంద్‌కు పిలుపివ్వడంతో వారు అక్కడ వున్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు చెప్పారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూనే మావోయిస్టులు బంద్‌కు పిలుపిచ్చారు. దీంతో ఇప్పటివరకు ఈ ఏడాదిలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 116 మంది మావోయిస్టులు మరణించారు.

➡️