ఆదివాసీల హక్కులను హరిస్తున్న మోడీ ప్రభుత్వం

Feb 28,2024 08:40 #aidwaa, #sadassu

-అడవులను, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

– ఐద్వా జాతీయ సహాయ కార్యదర్శి తపసి ప్రరాజ్‌

ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఆదివాసీల హక్కులను కేంద్రంలోని మోడీ సర్కారు హరిస్తోందని, అడవులను, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలు తీవ్రమవుతున్నాయని ఐద్వా జాతీయ సహాయ కార్యదర్శి తపసి ప్రహరాజ్‌ అన్నారు. ఆదివాసీ గిరిజన మహిళా సంఘం (ఐద్వా అనుబంధం) ఆధ్వర్యాన అరకువేలీలోని గిరిజన భవన్‌లో మంగళవారం ‘రాజ్యాంగ పరిరక్షణ – ఆదివాసీల ఉపాధి భద్రత’ అన్న అంశంపై సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం హడావిడి చేస్తున్న ‘సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌’ ఏ విధంగానూ ఆదివాసీల హక్కులు, చట్టాలు, ఉపాధి రక్షణకు తోడ్పడడంలేదన్నారు. అడవులను, సహజ వనరులను బడా సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం అటవీ చట్టాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. కులం, మతం పేరిట ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలపై తీవ్ర దాడి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వమూ గిరిజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. జిఒ 3ని పునరుద్ధరించి, చట్టబద్ధత కల్పించి ఆదివాసీలకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ నేటికీ నెరవేరలేదన్నారు. ఇప్పటి వరకూ ఆదివాసీ యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని చెప్పడం తప్ప ఆమెకూ గౌరవం ఇవ్వడంలేదన్నారు. మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఆదివాసీలకు ఆహార భద్రత కల్పించడం కోసం కుటుంబానికి నెలకు 50 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఉజ్వల్‌ యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఏజెన్సీలో 200 రోజులు పని కల్పించి, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వలసల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. సదస్సులో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, నాయకులు టి కౌసల్య, ఎస్‌ హైమావతి, వివి జయ, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు కె భాగ్యవతి, నాయకులు శశికళ, దేవుడమ్మ, కాసులమ్మ, శ్రామిక మహిళా సంఘం నాయకులు నాగమ్మ, వెంకటలక్ష్మి, కొండమ్మ, సత్యవతి పాల్గొన్నారు.

➡️