కారెక్కిన ఎమ్మెల్యేలు.. కంగుతిన్నారు !

Dec 3,2023 21:31 #Assembly Elections, #brs, #Telangana

 ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపిల నుంచి గెలిచి బిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఓటర్లు షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ నుంచి 12 మంది గంపగుత్తగా కారెక్కారు. వారిలో పది మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఘోరపజయం పాలయ్యారు. టిడిపిలో గెలిచి గులాబీ కండువా కప్పుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని నేతలు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. అయితే, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాత్రం గెలుపొందారు. ఓడిపోయిన వారిలో కొత్తగూడెం నుంచి గెలుపొందిన వనమా వెంకటేశ్వర్‌రావు, పినపాకలో రేగా కాంతారావు, ఇల్లెందులో హరిప్రియ నాయక్‌, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి, పాలేరులో ఉపేందర్‌రెడ్డి, ఎల్లారెడ్డిలో సురేందర్‌, కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌ రెడ్డి, తాండూరులో పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అత్రం సక్కు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరినవారే. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్‌రావు, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య టిడిపి నుంచి బిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి వీరంతా బిఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలో దిగినా వారికి నిరాశే మిగిలింది.

  • కారు దిగి ‘చేయి’ పట్టినోళ్లు గెలిచారు !!

ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు ఆశించి…సీట్లు రాకపోవడంతో ఆ నేతలు కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించారు. వేముల వీరేశం (నకిరేకల్‌), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి), మందుల సామేల్‌ (తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (పాలేరు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు) ఈ జాబితాలో ఉన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), జి.వివేక్‌ వెంకటస్వామి (చెన్నూర్‌) కూడా గెలిచారు.

➡️