మధ్యంతర ఉత్తర్వులివ్వం

Feb 23,2024 16:46 #adjourned, #AP High Court

టెట్‌-టిఆర్‌టి మధ్య వ్యవధి ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి :ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి-డిఎస్‌సి)ల నిర్వహణ మధ్య తగిన వ్యవధి ఉండేలా మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. రెండింటికీ మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. మధ్యంతర ఆదేశాలిస్తే తుది ఉత్తర్వులు జారీ చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్లు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. టెట్‌ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్‌, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్‌లపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు సహా ఐదుగురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇబ్బందికరంగా నోటిఫికేషన్లు ఉన్నాయని, వాటి మధ్య తగినంత వ్యవధి ఉండేలా చేయాలని, నోటిఫికేషన్లను రద్దు చేయాలని పిటిషనరు వాదించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయమూర్తి నిరాకరించారు.

➡️