టిడిపి, వైసిపి కార్యకర్తల ఘర్షణ

Mar 20,2024 23:59 #district, #gunter, #TDP, #YCP

– వలంటీర్లకు కానుకలు ఇస్తున్నారని టిడిపి ఆరోపణ

– కావాలని దాడికి వచ్చారని వైసిపి ఫిర్యాదు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని వైసిపి కార్యాలయంలో వలంటీర్లకు కానుకల పంపిణీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా వైసిపి నేతలు వలంటీర్లకు కానుకలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని టిడిపి పత్తిపాడు ఇన్‌ఛార్జి బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. వలంటీర్లకు కానుకలు పంపిణీ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, పరిశీలనకు వెళ్లిన తనపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, తన కారును సైతం ధ్వంసం చేశారని బుధవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసిపి, టిడిపి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో నల్లపాడు పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సమక్షంలోనే ఇరు గ్రూపులు ఘర్షణకు దిగారు. పోలీసులు అతి కష్టం మీద రామాంజనేయులును అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే, ఇదే అంశంపై పలువురు వైసిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ అభ్యర్థులు జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు కావాలని పత్తిపాడు వైసిపి కార్యాలయంపై దాడి చేశారని, ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మద్దాలి గిరి, వైసిపి అభ్యర్థులు బాలసాని కిరణ్‌ (పత్తిపాడు), నూరిపాతిమా (గుంటూరు తూర్పు) తదితరులు ఫిర్యాదు చేశారు. వలంటీర్లు తమ కార్యాలయం వైపునకు కూడా రాలేదని, రామాంజనేయులు కావాలని తమ కార్యాలయంపై దాడికి వచ్చారని బాలసాని కిరణ్‌ ఆరోపించారు.

➡️