బకాయిల కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

Jan 20,2024 07:56 #Dharna, #utf

– చెవిలో పువ్వులు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలు

ప్రజాశక్తి-యంత్రాంగం:పిఎఫ్‌, పిఆర్‌సి, ఇతర ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. చెవిలో పువ్వులు పెట్టుకొని, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని, మోకాళ్లపై నిలబడి వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ నేతలు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి బకాయి ఉన్న సరెండర్‌ లీవులు, ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉపాధ్యాయులు నిర్వహించిన మౌన ప్రదర్శనలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కెఎ.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద యుటిఎఫ్‌ నాయకులు మోకాళ్లపై నిల్చని నిరసన తెలిపారు. అనకాపల్లిలో చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు, అడ్డతీగల, చింతూరు కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఏలూరులో నిర్వహించిన ర్యాలీ నిర్వహించారు. నల్లరిబ్బన్లు కళ్లకు కట్టుకుని, మోకాళ్లపై నిల్చని, కొవ్వొత్తులు చేపట్టి నిరసనలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చెవిలో పూవ్వులు పెట్టుకుని, ప్రకాశం చౌక్‌లో మోకాళ్లపై నిలబడి ప్రదర్శనలు చేశారు. నెల్లూరు జిల్లా కావలి, కోవూరు తదితర మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. కడప జిల్లా మైదుకూరు, బద్వేలు, రాజంపేటలో చెవిలో పూలతో, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మూతికి నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. కర్నూలులో చెవిలో పూలుపెట్టుకుని, తలకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రదర్శన చేశారు. విజయనగరం కోట జంక్షన్‌ నుంచి గంట స్తంభం వరకు ర్యాలీ, పార్వతీపురం మన్యం జిల్లాలో చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. శ్రీకాకుళం, నరసన్నపేటలో చెవిలో పువ్వులు పెట్టుకుని మోకాళ్లపై నిల్చని నిరసన, టెక్కలిలో ర్యాలీ చేపట్టారు. ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, గుంటూరు, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు.

➡️