విద్యా రంగానికి కెవి రత్నం విశేష కృషి

Mar 20,2024 23:33 #kv ratnam, #passes away

-సామాజిక సేవలోనూ ముందంజ

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :ప్రముఖ విద్యావేత్త కెవి రత్నం… విద్యా రంగానికి విశేష కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉంటున్నారు. 1943 మే 23న చలపనాయుడుపల్లి కుగ్రామంలో కొర్రపాటి ఈశ్వరయ్యనాయుడు, తులసమ్మ దంపతులకు రెండో సంతానంగా ఆయన జన్మించారు. గ్రామంలో 3వ తరగతి, కొత్తపాళెం, ఆత్మకూరు ప్రాంతాల్లో పదో తరగతి వరకూ చదివారు. 1961-62లో పియుసి పూర్తి చేశారు. 1963 నుంచి 1966 వరకు నెల్లూరు విఆర్‌ కాలేజీలో బిఎస్‌సి కెమిస్ట్రీ డిగ్రీ తీసుకున్నారు. 1966 నెల్లూరు నగరంలోని రజక వీధిలో జయంతి ట్యుటోరియల్‌ ప్రారంభించారు. 1967లో తమ సమీప బంధువు పద్మావతిని వివాహం చేసుకున్నారు. చిన్నారి హార్ట్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి వందలాది చిన్నారులకు ఉచితంగా గుండె చికిత్సలు చేయించారు. 1986లో రత్నం కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. రత్నం విద్యా సంస్థలు అంచలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థలుగా నిలిచాయి. ఆయన కుమారులు డాక్టర్‌ వేణుగోపాల్‌, డాక్టర్‌ కిషోర్‌ నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో రత్నం విద్యా సంస్థలు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద ఇంజనీరింగ్‌ కాలేజీలు నడుపుతున్నారు. అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌కు ప్రత్యేక కోచింగ్‌ పొందుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సినీ నటులు, రాజకీయనేతలుగా ఎదిగిన వారు ఉన్నారు. వేలాదిమంది విదేశాల్లో స్థిరపడ్డారు. కెవి రత్నం భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. వారిలో ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్‌ స్రవంతి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎంఎల్‌సి పి.చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షలు అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు ఉన్నారు.

➡️