స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు హిందువులు కారా? – బిజెపి సమాధానం చెప్పాలి

Feb 9,2024 08:06 #Dharna, #Visakha JAC leaders

– జెఎసి దీక్షలో పి వెంకటరెడ్డి

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం):రోజూ హిందూ మతం జపం చేసే మోడీకి స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న హిందువులు కనబడలేదా అని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి వెంకటరెడ్డి ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుకు అప్పజెప్పడం హిందువులకు ద్రోహం చేసినట్లు కాదా? అనిప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1043వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన తప్పిదాలను పక్కదారి పట్టించడానికి హిందూమతాన్ని అడ్డు పెట్టుకుంటోందని విమర్శించారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మొదట పోస్కో, తర్వాత అదాని, ఇప్పుడు జిందాల్‌కు అమ్మడానికి ప్రయత్నం చేయడం దేశద్రోహం కాదా అని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వాలు ప్రజల డబ్బుతో ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటుచేసి దేశానికి అంకితం చేస్తే ఇప్పుడు బిజెపి పాలకులు గుజరాతీలైన అంబానీ, అదానీలకు అంకితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రయివేటీకరణ విధానాలను విడనాడకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, దానికి మద్దతు ఇస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు, కార్మిక వర్గాన్ని కోరారు. ఈ దీక్షల్లో పి అనిల్‌కుమార్‌, అశోక్‌, స్వామి, అభి తదితరులు పాల్గొన్నారు.

➡️