అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు

May 5,2024 21:29 #2024 election, #Nara Lokesh, #TDP
  •  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌, సిటీ : నెల రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి ఇస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపం వద్ద ఆదివారం విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పేరు చెబితే గుర్తుకొచ్చేది పంట చేలు, సంప్రదాయంగా నిర్వహించే కోడిపందేలని అన్నారు. ఈ ఎన్నికలతో జగన్‌ పని అయిపోయిందని, సిఎం సీటు నుంచి దిగిపోవాల్సిందేనని అన్నారు. 2014 ఎన్నికల్లో తండ్రి చనిపోయారని సానుభూతి కోసం ప్రయత్నించారని, 2019 ఎన్నికల్లో బాబాయిని చంపి, కోడి కత్తి డ్రామా ఆడి గెలిచారని అన్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని అన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ల్యాండ్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌గా అభివర్ణించారు. మన తాతలు కొన్న భూమి పట్టాలపై జగన్‌ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. దాని గురించి మాట్లాడితే తనపై సిఐడి కేసులు పెట్టారని, కేసులకు భయపడబోనని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కియా మోటార్స్‌ను తీసుకొచ్చామని, రెండుసార్లు డిఎస్‌సి విడుదల చేశామని చెప్పారు. చింతలపూడి లిఫ్ట్‌, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపైనే ఉంటుందని, భూమి రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే జరుగుతాయని అన్నారు. రహదారులను వేస్తామని, ఆక్వా రంగాన్ని, ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి కంపెనీలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

➡️