ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య

Jun 12,2024 23:27 #Hatya, #hydrabad, #teacher
  • పాఠశాల పున:ప్రారంభానికి వెళ్తుండగా ఘటన

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : పాఠశాలల పున:ప్రారంభం రోజున ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. నాగల్‌కొండ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు జాదవ్‌ గజానంద్‌ జైనథ్‌ (40) మండలం కెనాల్‌ మేడిగూడ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితునిగా విధులు నిర్వర్తిస్తూ, జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు నాగల్‌ కొండకు వచ్చాడు. బుధవారం పాఠశాల పున:ప్రారంభం కావడంతో స్వగ్రామం నుండే విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో అర్జుని-లోకారి రోడ్డు మార్గమధ్యలో హత్యకు గురయ్యారు. తలకు బలమైన గాయాలుండటంతో బండ రాయితో కొట్టి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదమా? లేక హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

➡️