వెంకటస్వామికి తుది వీడ్కోలు

Jan 29,2024 10:46 #Andhra Pradesh, #CPIM, #V.Srinivas rao

ప్రజాశక్తి- మర్రిపూడి (ప్రకాశం జిల్లా) : పిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కెల్లంపల్లిలో ఆదివారం ఉదయం జరిగాయి. హైదరాబాద్‌లో వెంకటస్వామి మృతి చెరదడంతో ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. సిపిఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, అండ్ర మాల్యాద్రి, జె.జయరాం, ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీదాస్‌, సిజిఎం అచ్యుతరావు, అసిస్టెంట్‌ ఎడిటర్‌ గడ్డెన్న, సిపిఎం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల కార్యదర్శులు ఎస్‌డి.హనీఫ్‌, మూలం రమేష్‌, సిహెచ్‌.గంగయ్య, సీనియర్‌ నాయకులు వై.సిద్ధయ్య, జాలా అంజయ్య, పూనాటి ఆంజనేయులు తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర సాగింది. గ్రామ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి ముందు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రమేష్‌ అధ్యక్షతన సంతాప సభ జరిగింది.

మతానికీ, రాజకీయానికీ మధ్య అప్పట్లోనే విభజన గీత గీశారు

మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఇటీవల ఎక్కువవుతోందని, అయితే, వెంకటస్వామి అప్పట్లోనే మతం వ్యక్తిగతమని, రాజకీయం ప్రజాసేవ అని స్పష్టంగా విభజన గీత గీశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. సంతాప సభలో ఆయన మాట్లాడుతూ 1970వ దశకంలోనే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్‌ఎంపిగా వెంకటస్వామి గ్రామీణ వైద్య సేవలందించారని తెలిపారు. ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీదాస్‌ మాట్లాడుతూ వెంకటస్వామి చివరివరకు కమ్యూనిస్టుగా బతికారని, ఆయన వారసత్వం కుటుంబానికి అందించారని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళని అన్నారు.

నాన్నకు ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఎక్కువ : వి శ్రీనివాసరావు

సంతాప సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి ఎంతో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో ఉండేవారంటూ గుర్తు చేసుకున్నారు. ముసలితనంలో ఉన్నా కర్ర ఊతంతో నడవడానికి నిరాకరించేవారని తెలిపారు. స్త్రీలను గౌరవించేవారని, ఆడపిల్లల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారని గుర్తు చేశారు. చివరి వరకూ తన కాళ్లపైనే తనపని తాను చేసుకోవాలనే పట్టుదలతో ఉండేవాడని తెలిపారు. ఈ సభలో సిపిఎం సీనియర్‌ నాయకులు జాలా అంజయ్య, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షులు రేగుల వీరనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ, జిల్లా నాయకులు ఎం.వెంకయ్య, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, కిసాన్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరపల్లి సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు.

➡️