పారిశ్రామిక ప్రగతికి మైలురాయి సెంచురీ పరిశ్రమ

Dec 23,2023 15:15 #ap cm jagan, #factory, #opened

-అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్‌ బిజీబిజీ

ప్రజాశక్తి- కడప ప్రతినిధివైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటైన సెంచురీ ఫ్లైవుడ్‌ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన తొలిరోజు బద్వేల్‌ నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని ఎపిఐఐసి పారిశ్రామికవాడలో వంద ఎకరాల్లో రూ.1000 కోట్లతో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైవుడ్‌ ప్లాంట్‌, కడపలోని రిమ్స్‌ ప్రాంగణంలో సుమారు రూ.230 కోట్లతో నిర్మించిన 452 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, వంద పడకల కేన్సర్‌ కేర్‌, వంద పడకల సైక్రియాటిక్‌ బ్లాకులు, రూ.ఆరు కోట్ల వ్యయంతో ఆధునీకరించిన కలెక్టరేట్‌ ప్రాంగణం, నగరంలోని పలు సర్కిళ్ల ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవాల్లో బిజీబిజీగా గడిపారు. బద్వేల్‌, కడప ప్రాంతాల్లో సుమారు రూ.1,340 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కడపలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద తనను కలిసిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా మాజీ గన్‌మెన్‌తోనూ, ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డితోనూ జగన్‌ మాట్లాడారు. కోటిరెడ్డి సర్కిల్‌ను ప్రారంభించిన అనంతరం రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు వెళ్లారు. ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలం సురేష్‌, కలెక్టర్‌ విజరుకుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గన్నారు.వామపక్ష, రైతు, ప్రజాసంఘాల నాయకుల అరెస్టుముఖ్యమంత్రి పర్యటనకు 24 గంటల ముందు పోలీసులు వామపక్ష నాయకులు, డివైఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ సహా పలువురికి నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు గంటన్నర ముందు జిల్లా అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎం పర్యటన అనంతరం వారందరినీ విడుదల చేశారు.

➡️