విద్యారంగ పరిరక్షణకు సామాజిక ఉద్యమం

Dec 10,2023 09:51 #meeting, #social movement, #utf
  • యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు
  • ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ నినాదంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం

ప్రజాశక్తి- ఏలూరు అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని తిరోగమనం వైపు తీసుకెళుతోందని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు విమర్శించారు. ప్రాథమిక విద్యను బతికించేందుకు ఉపాధ్యాయులు కదలి తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర 49వ కౌన్సిల్‌ సమావేశాలు శనివారం స్థానిక మినీ బైపాస్‌ రోడ్‌లోని చలసాని గార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక కెనాల్‌ రోడ్‌లోని యుటిఎఫ్‌ కార్యా లయం వద్ద ర్యాలీని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభా ప్రాంగణంలో స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జెండాను సాబ్జీ, యుటిఎఫ్‌ జెండాను యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, జాతీయ జెండాను పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జయప్రభ ఆవిష్కరించారు. యుటిఎఫ్‌ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత జరిగిన ప్రారంభ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామన్నారు. ఎంఎల్‌సి లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల నియామకాలకు ఒక డిఎస్‌సి కూడా వైసిపి ప్రభుత్వం విడుదల చేయలేదని గుర్తు చేశారు. అధికారంలోకొచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తానన్న సిఎం జగన్‌ మాట తప్పారని, జిపిఎస్‌ ప్రకటించడం సరికాదని అన్నారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నించారు. పాఠశాలల విలీన ప్రక్రియ ద్వారా విద్యారంగం తీవ్రంగా నష్టపోతోందని, విద్య చుట్టూ సామాజిక ఉద్యమాలు నిర్మించడం ద్వారానే విద్యారంగ సమస్య లు పరిష్కారమవుతాయని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవ డానికి యుటిఎఫ్‌ బహుముఖ కార్యక్రమాలు చేస్తోంద న్నారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చేందుకు ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ నినాదంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఎంఎల్‌సి, యుటిఎఫ్‌ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదంటూ నిర్బంధాలకు పూనుకుంటున్నారని, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ ఎన్‌జిపి-2020 పేరుతో దేశంలో ఏ రాష్ట్రంలోనూలేని విధంగా విద్యారంగంలో విధ్వంసాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాల్లో విలీనం చేయడంతో వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. మాతృభాష బోధన మాధ్యమంగా లేని విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశారని, ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమం ఉండాలని వివరించారు. జిల్లా జెఎసి చైర్మన్‌ చోడగిరి శ్రీనివాసరావు ప్రజలతో కలిసి ఓటు హక్కు ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ మెరుగైన సమాజం నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పాజిటివ్‌ థింకింగ్‌, మానవ విలువలు పెంపొందించాలని సూచించారు.

➡️