పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది : లోకేశ్‌

Jan 29,2024 12:37 #Nara Lokesh, #palnadu, #speech

పల్నాడు : పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టిడిపి నేత నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఎపి పోలీసులు, వైసిపి నేతల తీరుపై లోకేశ్‌ మండిపడ్డారు. లోకేశ్‌ మాట్లాడుతూ … పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకఅష్ణారెడ్డికి కొందరు పోలీసులు ప్రైవైటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలపై మారణహోమం కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసిపి లో చేరాలని… లేకపోతే రూ. 2 లక్షలు కప్పం కట్టాలని వేధిస్తున్నారని దుయ్యబట్టారు. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సై శ్రీహరి వేధింపులను భరించలేక టిడిపి సానుభూతిదారుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించి, పార్టీ మారాలని వేధించారని నిప్పులుచెరిగారు. దుర్గారావు కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దుర్గారావును ఆత్మహత్యకు పురిగొల్పడం పోలీసు శాఖకు మాయని మచ్చ అని మండిపడ్డారు. ఎస్సై శ్రీహరి వంటి పోలీసులు రాబోయే ప్రజా ప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఎపిలో ఉన్న విపరీత పోకడలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని విమర్శించారు. మూడు నెలల్లో వైసిపి ప్రభుత్వం పోయి టిడిపి – జనసేనల ప్రభుత్వం వస్తుందని లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

➡️