కమ్యూనిస్టులతోనే అన్ని వర్గాలకు ఆదరణ

  •  సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సిపిఎంతోనే అన్ని వర్గాలకు ఆదరణ అంటూ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. గత పాలకుల వైఫల్యాను ఎత్తి చూపుతూ.. బిజెపి కూటమి, నిరంకుశ వైసిపి ప్రభుత్వాలు మరోసారి అధికారంలోకి వస్తే ఎదురయ్యే సవాళ్లను వివరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తూ అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలకు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. పలుచోట్ల రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు శనివారం విస్తృతంగా పర్యటించారు. సున్నంపాడు గ్రామంలో గిరిజన మహిళలు రామారావుకు హారతులిచ్చి పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ఆ గ్రామం నుంచి ఆదివాసీ యువత భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సంతల్లో ప్రచారం చేశారు. అడ్డతీగల, విఆర్‌.పురం, వై.రామవరం, చింతూరు, జికె.వీధి మండలాల్లో ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు.
విశాఖ జిల్లా గాజువాకలోని నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెం, చినగంట్యాడ, చైతన్యనగర్‌, బిహెచ్‌పివి ప్రాంతాల్లో ఆ నియోజకవర్గ అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం నిర్వహిస్తూ.. తనను గెలిపిస్తే విశాఖ డెయిరీ కాలుష్య సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, గాజువాకలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తానని తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అరకు పార్లమెంటు అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స పలువురు ప్రముఖులు, ఓటర్లను కలిశారు. అనంతరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతున్న యువకులు, క్రీడాకారులను కలిసి మద్దతు తెలపాలని కోరారు. ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలను వివరించారు. తనను గెలిపించాలని కోరారు. పాచిపెంట మండలంలోని పాచిపెంట, అమ్మవలస, కర్రివలస, గైరంపేట తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కర్నూలు నగరంలోని బిటిఅర్‌ నగర్‌, అరుంధతీనగర్‌, ధనలక్ష్మినగర్‌, టెలికం నగర్‌, మాధవీ నగర్‌ ప్రాంతాల్లో పాణ్యం అభ్యర్థి డి గౌస్‌దేశారు ఇంటింటి ప్రచారం చేపట్టారు. అయన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అనేక సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలు ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు తాగునీరు, డ్రెయినేజీ కాల్వలు వంటి సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సౌకర్యాల కల్పనకు అన్ని విధాలుగా పోరాటం చేస్తామన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జ్నొ శివశంకరరావు, సిపిఐ గుంటూరు ఎంపి అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తీన్మార్‌, ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా జొన్న శివశంకరరావు మాట్లాడుతూ.. కొండ పోరంబోకు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

విజయవాడ సింగ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. పార్టీలు మారే నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గంలో ఏమి అభివద్ధి చేశారో? సెంట్రల్‌ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయడానికి వచ్చారో? ప్రజలకు చెప్పాలన్నారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని తెలిపారు. గతంలో సింగ్‌నగర్‌, ప్రకాష్‌ నగర్‌, రాజీవ్‌ నగర్‌ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగినా కమ్యూనిస్టుల హయంలోనే జరిగిందని తెలిపారు.

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఆ నియోజవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పదేళ్లలో మోదీ సర్కారు ప్రజలు, రైతు సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కేవలం కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేసిందని ధ్వజమెత్తారు. అలాంటి పార్టీకి టిడిపి, జనసేన, వైసిపి మద్దతివ్వడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను బలపరచాలని కోరారు.

 

నెల్లూరు నగరంలోని రామూర్తినగర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు నగరాభివృద్ధికి తనను గెలిపించాలని కోరారు.

➡️