HSL: హిందుస్థాన్‌ షిప్‌యార్డు కబ్జాకు అదానీ స్కెచ్‌!

8న విశాఖలో అదానీ షిప్పింగ్‌ ఇండియా సిఇఒ పర్యటన

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : అదానీ గ్రూప్‌ విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)ను కబ్జా చేసేందుకు స్కెచ్‌ వేస్తోంది. దేశంలోని పోర్టులు, గనులు, ఎయిర్‌ పోర్టులను కాజేస్తున్న అదానీ పోర్ట్స్‌, షిప్పింగ్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తాజాగా విశాఖపట్నం షిప్‌యార్డులో చొరబాటుకు యత్నాలను ఆరంభించింది. అదానీ గ్రూప్‌ ప్రతినిధి పర్యటనకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యం కార్యాచరణలోకి దిగింది. అదానీ కంపెనీ సిఇఒ, వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ కసరాగాడ్‌ విశాఖ షిప్‌యార్డు ఈ నెల 8న మధ్యాహ్నం మూడు గంటలకు పరిశీలనకు రానున్నారు. గ్రీన్‌ బ్యాటరీ టగ్స్‌ నిర్వహణపై ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ యార్డులోనే ఆయన ఉంటారు. షిప్స్‌ రిపేర్‌ సెంటర్లను పరిశీలించనున్నారు. షిప్‌యార్డులోని వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష చేయనున్నారు. అందుకోసం హెచ్‌ఎస్‌ఎల్‌ కాన్ఫరెన్స్‌ హాలును సర్వహంగులతో అలంకరిస్తు న్నారు. షిప్‌యార్డు యాజమాన్యం ఆయన పర్యటనను అధికారికంగానే స్వీకరించి ఆహ్వానం పలుకుతోంది. దేశంలో సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల కాజేతకు అంబానీ, అదానీ ద్వయాన్ని ‘కుడి, ఎడమ’లుగా పెట్టుకుని బిజెపి పాలన సాగిస్తోందన్న మేధావుల విమర్శలకు అద్దం పట్టేలా విశాఖ షిప్‌యార్డులోకి అదానీ ఎంట్రీకి కేంద్రం ఆస్కారమిచ్చిందన్న చర్చ సాగుతోంది. విశాఖ పోర్టులో ఇక్యూ-1 బెర్తును తీసుకుని ఏడేళ్లపాటు కార్గో హేండ్లింగ్‌ జరపకుండా రూ.వందల కోట్లు వైజాగ్‌ పోర్టుకు నష్టం తెచ్చిన అదానీ పోర్ట్స్‌ కథ తెలిసిందే. గంగవరం పోర్టును కబ్జా చేసిన అదానీ… స్టీల్‌ప్లాంట్‌పైనా, తాజాగా షిప్‌యార్డులోనూ కాలు మోపే యత్నాలకు దిగడం వెనుక కేంద్ర ప్రభుత్వ దన్ను పుష్కలంగా ఉంది.

  • అదానీ నియంత్రణలోనే ఆంధ్రప్రదేశ్‌…

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ఇప్పటికే తన నియంత్రణలోకి తెచ్చుకున్న అదానీ గ్రూప్‌ నౌకానిర్మాణ కేంద్రాల్లోకి ఎంట్రీకి ప్రయత్నిస్తుండడంతో విశాఖలోని షిప్‌యార్డు ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన మొదలైంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని సైతం జిందాల్‌కు కేంద్రం అప్పగించిన విధంగా షిప్‌యార్డులోని టగ్‌ల రిపేర్లు, నిర్మాణం, ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)-5ల నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకే ఈ పర్యటనకు అవకాశం కల్పించారని, గ్రీన్‌ టగ్‌లు ఎలా నిర్మాణం చేయాలో షిప్‌యార్డుకు తెలుసని, అదానీ నుంచి నేర్చుకోవాల్సిందేమీ లేదని కార్మికులు, ఉద్యోగులు అంటున్నారు. 1941లో స్థాపించబడిన షిప్‌యార్డులో ఫ్లీట్‌ సపోర్టు షిప్‌లను నిర్వహించడం ద్వారా రూ.18 వేల కోట్ల టర్నోవర్‌ సాధించగలదని సిఎమ్‌డి హేమంత్‌ ఖత్రీ ఇటీవలే షిప్‌యార్డు 80వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇది పటాపంచలయ్యేలా ఈ ఆర్డర్‌ను కేంద్రం అదానీకి కట్టబెట్టే చర్యలను తెరవెనుక చేస్తోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

  • ఏం జరగబోతుంది?

దేశంలోని కొచ్చిన్‌ షిప్‌యార్డులోకి ఇదివరకే అదానీ హార్బర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ప్రవేశించింది. దేశంలోని మేజర్‌ పోర్టులన్నిట్లోనూ అదానీ పోర్ట్స్‌ (హార్బర్‌ సర్వీసెస్‌) తయారు చేసే గ్రీన్‌ టగ్స్‌ను వాడాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీనికే పోర్టులు, షిప్పింగ్‌ల రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌గా కేంద్రం నామకరణం చేసింది. కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ గ్రీన్‌ టగ్‌ ట్రాన్సిమెషిన్‌ ప్రోగ్రామును ప్రారంభించి కొచ్చిన్‌ షిప్‌యార్డుతో అదానీ గ్రూప్‌తో ఎంఒయు చేయించింది. దేశమంతటా దీన్ని అమలు చేయడం ద్వారా షిప్‌యార్డులన్నిటిపైనా అదానీ అజమాయిషీ పెంచే కుట్రను మోడీ ప్రభుత్వం చేస్తోంది. గతంలో హెచ్‌ఎస్‌ఎల్‌లో సబ్‌మెరైన్‌ పి-75ఐ కాంట్రాక్టుకు అదానీ టెండరు వేశాడు. ఈ గ్రీన్‌ టగ్‌లనేవి షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమకు ఊతమిచ్చే పరిస్థితి ఉండదన్నది విశాఖ షిప్‌యార్డు కార్మికులు, ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పేరుతో జొరబడి భారీ నౌకల నిర్మాణమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ల కాంట్రాక్టును తన్నుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️