అటవీ చట్ట సవరణతో ఆదివాసీలకు ముప్పు

May 8,2024 23:30 #2024 election, #Brinda Karat, #cpm

– కార్పొరేట్ల కోసం బిజెపి దుష్ట చర్యలు
– పాడేరు, చింతపల్లి ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌
ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి విలేకరులు
గిరిజన ప్రాంతంలోని వనరులను కార్పొరేట్లకు అప్పగించేందుకే అటవీ సంరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించిందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌ అన్నారు. బడా కార్పొరేట్ల లాభాల కోసం ఆదివాసీ హక్కులను దెబ్బతీస్తోన్న బిజెపిని, ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తోన్న టిడిపి, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కులను కాపాడే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇండియా వేదిక తరఫున బరిలో ఉన్న సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, కాంగ్రెస్‌ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి శతక బుల్లిబాబుకు మద్దతుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లిల్లో బుధవారం రోడ్‌షో, బహిరంగ సభలు జరిగాయి. వీటికి ముఖ్య అతిథిగా హాజరైన బృందాకరత్‌ మాట్లాడుతూ.. ఆదివాసీలకు ఉన్న ప్రత్యేక గ్రామసభ హక్కును తొలగించి, బాక్సైట్‌, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుల పేరుతో అదానీ వంటి కార్పొరేట్ల ప్రవేశానికి బిజెపి అవకాశం కల్పించిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన గ్రామ సభ హక్కును కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం కాలరాయడం దారుణమన్నారు. అభివృద్ధి పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అటవీ ప్రాంతంలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్లు సర్వనాశనం చేయడానికి గిరిజన గుండెలపై కుంపట్లు పెడుతున్నారని అన్నారు. కోర్టు తీర్పును అడ్డుపెట్టుకొని జిఒ 3 ప్రకారం వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ అమలును అడ్డుకున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటుపరమైతే ఆదివాసీలకు రిజర్వేషన్లు వర్తించవని, ఉద్యోగావకాశాలు కోల్పోతారని వివరించారు. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు పాలకులు నిధులు విడుదల చేయడం లేదన్నారు. మణిపూర్‌లో డబుల్‌ ఇంజన్‌ సర్కారు క్రిస్టియన్‌ గిరిజనులపై ఏడాదిగా దాడులకు పాల్పడుతోందని అన్నారు. ఆదివాసీల హక్కులపై చేస్తున్న బిజెపి దాడులను ప్రశ్నించకుండా కేసులు, జైల్లో పెడతారన్న భయంతో వైసిపి, టిడిపి మౌనంగా ఉన్నాయని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ.. అడవులను అదానీపరం చేస్తూ గిరిజనులకు ముప్పు కలిగిస్తున్న మోడీని బంగాళాఖాతంలో కలపాలని కోరారు. సిపిఐ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ.. అటవీ భూములపై హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా గిరిజనులు పోరాడారని తెలిపారు. వాటిని ఇప్పుడు లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స మాట్లాడుతూ… ఆదివాసీ ద్రోహులను ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సభల్లో కాంగ్రెస్‌ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి బుల్లిబాబు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు, అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నయ్యపడాల్‌, కాంగ్రెస్‌ నాయకులు వీరన్న పడాల్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగరాజు పాల్గన్నారు. పాడేరు, చింతపల్లిల్లో నిర్వహించిన భారీ ర్యాలీల్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️