గ్రూప్‌-1 భర్తీ రద్దుపై అప్పీల్‌ విచారణ వాయిదా

Apr 29,2024 22:08 #AP Group 1, #AP High Court, #Exams

ప్రజాశక్తి-అమరావతి : ఎపిపిఎస్‌సి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం జరిపిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాల మ్యాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు నివేదించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న 167 మందిని తొలగించరాదన్న మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. విచారణను మే 8కి వాయిదా వేస్తూ జస్టిస్‌ జి నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌ హరినాథ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. .
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ఎపిపిఎస్‌సి, ఆ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురు ఉద్యోగులు ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోరాదని సీనియర్‌ న్యాయవాది జంద్యాల రవిశంకర్‌, న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్‌ వాదించారు. 2021 డిసెంబరు 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య మాన్యువల్‌ పద్ధతిలో మూల్యాంకనం చేశాక ఎపిపిఎస్‌సి ఫలితాల్ని ప్రకటించలేదని, మార్చి 25 నుంచి మే 26 మధ్య చేసిన మూల్యాంకనం ఫలితాలనే ప్రకటించిందని అన్నారు. ఎపిపిఎస్‌సి తరపున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రతివాదన చేస్తూ, 2021 డిసెంబరు 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం జరగలేదన్నారు.

➡️